హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటూ ప్రచార సభల్లో గొప్పలు చెప్పిన రాష్ట్ర రెవెన్యూ, హౌసిజింగ్శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రతిష్ఠాత్మకంగా భావించిన, తన సొంత నియోజకవర్గంలా చెప్పుకునే, తనకు తిరుగులేని పట్టున్న మున్సిపాలిటీగా పేర్కొనే స్థానాల్లోనే కాంగ్రెస్ చతికిలపడింది. ఎన్నికల ప్రచార సభల్లో పోటీపడి గొప్పలు చెప్పిన పొంగులేటి.. ఫలితాలు వచ్చిన తర్వాత ఏం చెప్తారని కాంగ్రెస్ సీనియర్లే ప్రశ్నిస్తున్నారు. మంత్రి పొంగులేటి పరిధిలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. అక్కడ తాము పాగా వేస్తామని మొదటి నుంచీ మంత్రి చెప్తూ వచ్చారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు నుంచి సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకొని పనిచేస్తున్నది. కానీ మంత్రి పొంగులేటి అత్యుత్సాహం ప్రదర్శించడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఇబ్బందిపడ్డాయి. మిత్రధర్మంతో పనిచేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నించాయి. అయితే మంత్రి పొంగులేటి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌ను సొంతంగా గెలుచుకుంటామంటూ గొప్పలకు పోయారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా పొంగులేటి చెప్పినదానికి సరే అన్నది. దీంతో కమ్యూనిస్టు పార్టీలు దూరమయ్యాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో మంత్రి పొంగులేటి తన వర్గాన్ని పూర్తిగా మోహరించారు.చివరకు సీపీఐ కన్నా ఒక్క వార్డు కూడా అదనంగా గెల్చుకోలేకపోయారు. కొత్తగూడెంలో సీపీఐకి 22, కాంగ్రెస్‌కు 22 సీట్లు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలు సాధించగా స్వతంత్రులు ఆరు స్థానాలు గెలుపొందారు. కాంగ్రెస్ మొండివైఖరితో సీపీఐ దూరమయ్యింది. పొంగులేటి ప్రచారం చేసిన ప్రాంతాల్లోనూ ఫలితాలు అంతంత మాత్రమే వచ్చాయి.