సిద్దిపేట, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):వ్యవసాయ నల్ల చట్టాలపై రైతుల ఆందోళన ఫలితమిచ్చింది. ఏడాదిగా చేస్తున్న ఆందోళనలు, పోరాటానికి తలొగ్గి, ఎట్టకేలకు కేంద్ర సర్కారు దిగివచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంట్లో రద్దు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం ప్రకటించగా, దేశవ్యాప్తంగా అన్నదాతల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఏడాది కింద తెచ్చిన కొత్త చట్టాలు రైతులకు కష్టాలు తెచ్చేలా ఉండగా, రైతులోకం వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలిపింది. ఈ ఉద్యమంలో అనేక మంది రైతులు అసువులు బాసినా, అంతే ఉధృతంగా పోరాటం సాగింది. రద్దుచేసే దాకా ఉద్యమం ఆగదని భీష్మించింది. లాఠీదెబ్బలు, బుల్లెట్లు, వాటర్కాన్లు, పోలీస్ కంచెలను ఎదురొడ్డి, చారిత్రక విజయం సాధించింది. రైతుల పట్టువీడని స్ఫూర్తి అద్భుతమని, రైతు శక్తి కేంద్రానికి తెలిసివచ్చిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు సంబురాలు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. చట్టాల రద్దు నిర్ణయంపై పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
చట్టాల రద్దు ప్రకటనపై రైతుల హర్షం..
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కింద తెచ్చిన కొత్త చట్టాలు రైతులకు కష్టాలు తీసుకొచ్చిందని చెప్పాలి. చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాదిగా వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతూ వచ్చారు. కార్పొరేట్ కంపెనీలు నేరుగా రైతులతో కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాలు చేసుకునే ఈ బిల్లులతో రైతులు, వినియోగదారులకు కష్టాలు ఉంటుండే. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడం జరుగుతుండే. మార్కెట్ కమిటీలను నిర్వీర్యం కానుండడం.. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కార మార్గాలను మరింత జఠిలం చేసేలా కేంద్రం తెచ్చిన బిల్లులో ఉండే. ఓ సామాన్య రైతు బడా కార్పొరేట్ సంస్థలతో న్యాయపోరాటం చేయగలడా? ఇవన్నీ సాధ్యమా? కొత్త వ్యవసాయ బిల్లు ప్రకారం రైతులను కార్పొరేట్ ఇష్టారాజ్యానికి వదిలేసి, కేంద్రం తన కనీస బాధ్యతల నుంచి తప్పుకుంది.
ప్రభుత్వం నిత్యావసరాలను నిల్వ చేసి ఎఫ్సీఐలాంటి సంస్థలు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుతో కనుమరుగయ్యేవి. ఫలితంగా ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమయ్యేది. కార్పొరేట్ శక్తులు కృత్రిమ కొరతను సృష్టించి వినియోగదారుల నడ్డి విరిచేవి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుండే. ఇందులో వచ్చే లాభం రైతులకు కాకుండా కార్పొరేట్ వ్యవస్థకు వెళ్తుండే. వందశాతం ధరలు పెరిగే వరకు నిత్యావసర వస్తువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకునే వీలు లేకుండే. ఈ బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం? ఇందులో రైతుకు ఉపయోగపడే ఏ ఒక్క సిఫారసును అమలు చేయలేదు. కొత్త విధానంలో వ్యాపారులకు ఎలాంటి లైసెన్సు ఉండదు. పాన్ కార్డు ఉంటే చాలు. రైతు నుంచి వ్యాపారి సరుకు కొన్న తర్వాత డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడితే జవాబుదారీతనం ఉండదు. అంతే కాకుండా వ్యవసాయ చెక్‌పోస్టులు ఎత్తేయాల్సి వస్తుండే. అందులో పని చేసే సిబ్బంది, వాటిపై ఆధారపడి బతికే కార్మికులు రోడ్డున పడక తప్పని పరిస్థితులు. ఇవాళ రైతులకు నష్టం కలిగే చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కంగ్టిలో సంబురాలు
కేంద్రం వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినందున శుక్రవారం కంగ్టి మండల కేంద్రంలోని నేతాజీచౌక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఇది రైతుల విజయమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అతిమేల మాణిక్యం, సీపీఎం నియోజకవర్గ ఏరియాకమిటీ కన్వీనర్ చిరంజీవి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింహులు, సీఐటీయూ నాయకులు మొయినుద్దీన్, విజయ్‌కుమార్, ప్రజాసంఘాల నాయకులు దత్తు, రాజు, సంగ్రామ్, శంకర్, సిద్ధిరాం తదితరులు పాల్గొన్నారు.
రైతుల విజయం
రైతులు విజయం సాధించిన తీరు అద్భుతం. రైతు శక్తిని కేంద్రానికి చూపించింది. రైతులను నట్టేటా ముంచేలా ఉన్న నల్ల చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం. ఏడాది కాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, పోలీస్ కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి, విజయం సాధించిన తీరు అనిర్వచనీయం. ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీరులందరికీ ఉద్యమాభివందనాలు.
ఇకనైనా ద్వంద్వ విధానాన్ని మానాలి
వ్యవసాయ చట్టాలు రద్దుపై వీరోచితంగా పోరాటం చేసిన రైతులకు శుభాకాంక్షలు. చట్టాలపై గతంలో అనేక రాష్ర్టాలు డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్పొరేటరైజేషన్ విధానాన్ని మానుకొని, వ్యవసాయ విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పటికైనా బీజేపీ నేతలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని వీడాలి. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్‌ను చూసి ప్రధాని నేర్చుకోవాలి.
పార్లమెంట్లో తీర్మానం చేయాలి
రైతు ఉద్యమానికి కేంద్రం తలొగ్గి, చట్టాలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. రైతు చట్టాల రద్దు ప్రకటన చేయడం సంతోషకరమే కానీ, పార్లమెంట్లో రద్దుపై తీర్మానం చేయాలి. అదే విధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. పోరాటంలో చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి.
కేంద్రం తప్పు తెలుసుకుంది
కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని రైతుల విజయంగా భావిస్తున్నాం. చట్టాలు అమలు చేయకుండా రైతులు ఏడాదిగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి, అనేక రైతులను బలి తీసుకుంది. చట్టాలను సమర్థిస్తూ వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తన తప్పును తెలుసుకుని చట్టాలను ఉపసంహరించుకున్నది.
రద్దు సరైన ముందడుగు
రైతుల ఆందోళనలతో కొత్త చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటన చేయడం సంతోషంగా ఉంది. ఇది అన్నదాతల విజ యం. మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన రైతుల త్యాగాలకు ఫలితం దక్కింది. ప్రాణాలకు తెగించి రైతులు పోరాడిన తీరును భవిష్యత్ తరాలకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది.
ఇది ముమ్మాటికి రైతుల విజయమే..
ఏడాది కాలంగా రైతుల నిరసనలకు కేంద్రం దిగి వచ్చి, నల్ల చట్టాలను రద్దు చేసింది. ఇది ముమ్మాటికి రైతుల పోరాట విజయమే. ఇంతటి పోరాట పఠిమను కనబర్చిన రైతు సోదరులకు రైతుబంధు సమితి పక్షాన హృదయపూర్వక అభినందనలు.
కేంద్రం రైతులను పట్టించుకోవడం లేదు
కేంద్రం రైతులను పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్ రైతులకు ఆసరాగా అయితాండు. బీజేపోళ్లు చేసేది లేదు.. పెట్టేది లేదు.. గాయిగాయి చేస్తుండ్రు. రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. వాళ్లను ఎవలు నమ్ముతారు. రైతులకు ముఖ్యమంత్రి ఎప్పుడు మేలే చేస్తాడు. గా నమ్మకం మాకుంది.
అహంకార వీగింది..
కార్తిక పౌర్ణమి రోజు మంచి వార్త విన్నాం. కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అహంకారం వీగింది. దేశంలో అన్నదాత గెలిచాడు. దేశంలోని వివిధ రాష్ర్టాలో రైతులు ప్రాణాలు త్యాగం చేసి పోరాటం చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలని అలు పెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క అన్నదాతకు హృదయ పూర్వక అభినందనలు.
రైతుల పోరాటానికి ఫలితమిది..
కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న చట్టాలను రైతులు ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఏడాది కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. పలురాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీఎం కేసీఆర్ కూడా రైతుల పక్షాన నిలవడం సంతోషం. కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను రద్దు చేయడం, రైతు లేనిదే రాజ్యం లేదని నిరూపించింది.