
చిన్నకోడూరు, నవంబర్ 14: రైతులు ధాన్యాన్ని విక్రయించే సమయంలో వాతావరణ పరిస్థితులతో తీవ్రంగా నష్టం జరుగుతున్నది. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు ప్రభుత్వం భద్రత కల్పించనున్నది. ప్రభుత్వం భారీ ఎత్తున గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట జిల్లాలో స్టేట్‌వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కింద 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి రూ.45కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆయా గ్రామాల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్న వైనంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో 10వేల మెట్రిక్ టన్నుల గోదాముకు రూ.5 కోట్లు, చర్లఅంకిరెడ్డిపల్లిలో 10 వేల మెట్రిక్ టన్నుల గోదాముకు రూ.5 కోట్లు, దు బ్బాక మండలం హబ్సీపూర్‌లో 10 వేల మెట్రిక్ టన్నుల గోదాముకు రూ.5 కోట్లు, నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో 10 వేల మెట్రిక్ టన్నుల గోదాముకు రూ.5 కోట్లు, గుర్రాలగొందిలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించే గోదాముల పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఈ నిధులతో ఆఫీసు కార్యాలయం, వేబ్రిడ్జ్, హమాలీషెడ్, గోదాము చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. గోదాముల నిర్మాణం పూర్తయితే ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి.
జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతో..
సిద్దిపేట జిల్లాలో ఐదేండ్లతో పోల్చి చూస్తే సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. 2018 -19 వానకాలం సీజన్లో వరి దిగుబడి 1.89 లక్షల మెట్రిక్ టన్నులు, 2020 యాసంగి సీజన్లో వరి దిగుబడి 5.33 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. దీనికి తోడు సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి పంట ఉత్పత్తులను సిద్దిపేటలో నిల్వ చేసేకునేందుకు వస్తున్నారు. దీంతో సిద్దిపేటలో గోదాముల వినియోగం పెరిగింది.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తున్నది. రైతులు పండించిన ధాన్యా న్ని గ్రామాల్లోనే విక్రయిం చి మద్ధతు ధర పొందే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంలో ధాన్యాన్ని విక్రయించడానికి దూర ప్రాం తాలకు వెళ్లినప్పటికీ మద్ధతు ధర లభించేది కాదు. రెండు గ్రామాల్లో గోదాముల నిర్మాణం అందుబాటులోకి వస్తే రైతులకు ధాన్యం నిల్వ చేసుకునే వెసులుబాటు కలుగుతున్నది.
నిల్వ ధాన్యంపై లోన్
వేర్ హౌస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 50 వేల సామర్థ్యంతో నిర్మిస్తున్న గోదాములు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతగానో సౌలభ్యంగా మారనున్నాయి. ప్రభుత్వం సాగునీరు అందించడంతో పంట ఉత్పత్తి పెరిగింది. దీనికి అనుగుణంగా గోదాములు లేకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి ప్రభుత్వం గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. రైతులు పండించిన ధాన్యాన్ని గోదాముల్లోని ధాన్యంపై రుణ సదుపాయం కల్పించడం జరుగుతున్నది.