
ములుగు, జూలై 3 : గ్రామాల సంపూర్ణ అభివద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సర్కారు ముందుకెళ్తున్నదని, పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని, ప్రతీ పల్లెను పట్టణానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో శనివారం నిర్వహించిన పల్లె ప్రగతిలో మంత్రి పాల్గొన్నారు. పాఠశాల అదనపు గదులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మోడ్రన్ బస్‌స్టాప్‌ను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. విలేజ్ ఫంక్షన్‌హాల్, బీసీ కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి, మొక్కల పెంపకం బాగుందని కితాబునిచ్చారు. మండలంలోనే మొదటి పామాయిల్ పంటను సాగు చేస్తున్న రైతు కొన్యాల బాల్‌రెడ్డి పొలంలో మొదటి మొక్కను మంత్రి నాటారు. ఎంపీటీసీ మమతాబాల్రెడ్డి విన్నపం మే రకు గ్రామంలో లైబ్రెరీ, పోస్టాఫీస్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఒకప్పుడు నిధులలేమితో గ్రామాల అభివృద్ధి చీకట్లలో మగ్గిపోయేవని, కానీ నేడు సీఎం కేసీఆర్ కృషితో పల్లెలన్నీ పట్టణాలకు ఆదర్శంగా మారుతున్నాయని చెప్పారు. పల్లె ప్రగతితో ప్రతీ ఊరు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తున్నదన్నారు. గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటి హరితవనాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రైతులు మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా పంటలను పంటలు వేయాలని, పామాయిల్ సాగుతో రైతులు లాభాలు పొందవచ్చాన్నారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణరెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీపీ లావణ్యాఅంజన్గౌడ్, జడ్పీటీసీ జయమ్మ, జడ్పీకోఆప్షన్ సభ్యుడు సలీం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జుబేర్‌పాషా, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.