
సిద్దిపేట, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లు గోదావరి జలాలతో నిండుకుండలా మారాయి. రెండు రోజుల నుంచి జిల్లాలోని రిజర్వాయర్లలోకి గోదావరి జలాలను విడుదల చేస్తున్నారు. దీంతో అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లు నిండి సొరంగం, ఓపెన్ కెనాల్ ద్వారా తుక్కాపూర్ పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ప్రవహించి అక్కారం పంప్‌హౌస్‌కు చేరుకున్నాయి. అక్కడి నుంచి మర్కూక్ పంప్ హౌస్ గుండా కొండపోచమ్మ రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ మల్లన్నసాగర్ తుక్కాపూర్ పంప్‌హౌస్ వద్ద అడ్వైజర్ పెంటారెడ్డితో కలిసి మంగళవారం రెండు మోటర్లను ప్రారంభించారు . అక్కడి నుంచి అక్కారం వద్ద గోదావరి నీటిని పరిశీలించారు. ఈ నెల 20న సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి చెరువు, కుంట, చెక్‌డ్యాంలను నింపాలని, భూమి అంతా బుడబుడ కావాలని మంత్రి హరీశ్‌రావు సూచించిన విషయం తెలిసిందే. వర్షాకాలం ప్రారంభంలోనే రిజర్వాయర్లకు గోదావరి జలాలు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవుసం పండుగలా చేసుకుంటున్నారు.
సిద్దిపేట-రాజన్నసిరిసిల్ల జిల్లాల సరిహద్దులో నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు వస్తాయి. రాజరాజేశ్వర రిజర్వాయర్ నుంచి అన్నపూర్ణ సర్జిపూల్‌కు గోదావరి జలాలు వస్తున్నాయి. ఈ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 2.35 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక మోటర్ ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నారు. ప్రతిరోజు రిజర్వాయర్‌లోకి 3200 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి ఓపెన్ కెనాల్, సొరంగం ద్వారా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌజ్‌కు చేరుకుంటున్నాయి. ఇక్కడ ఒక మోటర్‌ను ప్రారంభించారు. ఈ మోటర్ ద్వారా రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తి రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో పోస్తున్నది. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 2.75 టీఎంసీలున్నాయి. అక్కడి నుంచి ఓపెన్ కెనాల్, సొరంగ మార్గం ద్వారా మల్లన్నసాగర్ తుక్కాపూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌కు గోదావరి జలాలు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కెనాల్ ద్వారా కొండపోచమ్మకు నీటిని తరలిస్తున్న విషయం తెలిసిందే. తుక్కాపూర్ పంప్‌హౌస్ వద్ద మంగళవారం రెండు మోటర్లను ప్రారంభించారు. ఒక్కో పంప్ నుంచి 2400 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. రోజుకు రెండు పంపులు కలిపి 2800 క్యూసెక్కుల నీళ్లు కెనాల్ ద్వారా అక్కారం పంప్‌హౌస్‌కు వెళ్తున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు అక్కడికి చేరుకున్నాయి. రాత్రి వరకు మర్కూక్ పంప్‌హౌస్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు.
ఈ రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.7 టీఎంసీలున్నాయి. గత వేసవి కాలంలో సంగారెడ్డి కెనాల్ ద్వారా మండుటెండల్లో చెరువులు, చెక్‌డ్యాంలు నింపి 96 కి.మీటర్ల దూరంలోని శ్రీరాంసాగర్‌కు తరలించారు. కూడవెల్లి వాగు ద్వారా చెక్‌డ్యాంలు నింపుకొని రాజన్నసిరిసిల్ల జిల్లాలోని నర్మాల చెరువును నింపారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లతో పాటు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని చెరువులు, చెక్‌డ్యాంలు నింపారు. సిద్దిపేట జిల్లాలో దాదాపుగా 300కు పైగా చెరువులు అలుగులు పారాయి. జూన్ మాసం చివరలోనే రిజర్వాయర్ల నింపుకోవడంతో పాటు ప్రతి చెరువు, చెక్‌డ్యాంను నింపాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు.