
సిద్దిపేట, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు వచ్చాయంటే రైతుల గుండెల్లో గుబులు…! పంటలు సాగు చేయాలంటే పెట్టుబడులకు ఎవరి దగ్గరికి పోవాలి అనే బెంగ రైతులను వేధించేది…! షావుకార్ల వద్దకు పరుగులు పెట్టే వారు.. ఆ షావుకార్లు రైతుల అమాయకత్వాన్ని చూసి ఒకటికి రెండు మందు బస్తాలు రైతు ఖాతాలో రాసిపెట్టేవారు. పంట పండాక ఆ దినుసు ఆ షావుకారికే ఇవ్వాలని షరతు పెట్టేవారు. ఇవన్నింటికి ఒప్పుకొని రైతు షావుకారు వద్ద పంట పెట్టుబడి తీసుకువచ్చి సాగుచేసిన రోజులు.. వడ్డీలకు డబ్బులు తెచ్చి పంట సాగు చేస్తే చివరికి అప్పులే మిగిలేవి.గతంలో అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులకు ఆ తిప్పలు తప్పాయి. రైతుల ముఖచిత్రం మారింది. పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురు చూడకుండా విత్తు విత్తక ముందే సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ‘రైతుబంధు’ కింద ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు గాను ఏటా రూ.10 వేలు అందించి అన్నదాతకు ఈ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. వానకాలం సాగు ప్రారంభం కాగానే ఒక గుంట భూమి ఉన్న రైతును మొదలుకొని పట్టా భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. దీంతో రైతులు సంబురంగా ఎవుసం చేసుకుంటున్నారు.
షావుకార్ల వద్దకు పోవుడు బంద్ చేసిన్రు…ప్రభుత్వం ఇచ్చిన పంట పెట్టుబడి సాయంతో ఇత్తులు, ఎరువులు, దున్నకం చేసుకుంటున్నారు. దినుసు వచ్చాక ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళ్లి మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. అప్పులు తెచ్చుకొని పంట పండించిన రైతులు, ఇవ్వాళ చినుకు పడకముందే ‘రైతుబంధు’ డబ్బులు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. రైతుల జేబులో నాలుగు రూపాయలు కనిపిస్తున్నాయి. బ్యాంకర్లు వచ్చి పంట రుణాలు ఇస్తున్నారు. ఒకప్పుడు ఎకరానికి రూ. 20 వేల పంట రుణం ఇచ్చిన వాళ్లు, ఇప్పుడు ఎకరానికి రూ. 30 వేలకు పైగా పంట రుణాలను ఇస్తున్నారు. రైతులపై బ్యాంకులకు నమ్మకం పెరిగింది. గ్రామాల్లోనే చిన్న చిన్న బ్యాంకులు ఏర్పాటు చేసి అరగంటలో పంట రుణాలు ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లను నింపడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది. పడావు భూములు సైతం సాగులోకి వచ్చాయి. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధ్దతులను తెలియజేయడానికి ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ప్రభుత్వం నిర్మించింది. ఈ వేదికల్లో రైతలు సమావేశమై పంటల సాగు, మార్కెట్ విధానం తదితర అంశాలపై చర్చించుకుంటున్నారు. ఇలా ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో రైతులు పండుగలా ఎవుసం చేసుకుంటున్నారు.
వరుసగా ఏడో పంటకు రైతుబంధు..
రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. మే 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు గాను ఏడాదికి రూ.8 వేలను అందించారు. గత శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలను అందిస్తున్నారు. 2019 వానకాలం నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తున్నారు. ప్రస్తుత వానకాలం పంటతో వరుసగా ఏడో పంటకు రైతుబంధు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వంరైతు సంక్షేమం కోసమే అనేక పథకాలను అమలు చేస్తున్నది. రైతుబీమా పథకంతో రైతు కుటుంబాల్లో భరోసా నింపింది. సబ్సిడీపై యంత్రాలు, ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధరను కల్పించింది. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో దళారుల బెడద తప్పింది.గడిచిన యాసంగిలో భూమికి బరువయ్యేలా పంట పండింది. ప్రతి గింజనూ కొనుగోలు చేసి వారం రోజుల్లోనే వారి ఖాతాలో నేరుగా డబ్బులను ప్రభుత్వం జమచేసింది.
పంట రుణాలు సులభతరం ..
సిద్దిపేట జిల్లాలో రైతులకు పంట రుణాలను ఇవ్వడానికి బ్యాంకర్లు వ్యవసాయ ప్రణాళికను సిద్ధ్దం చేసుకున్నారు. అందుకు అనుగుణంగా రైతుల పంట రుణాలను రెన్యువల్ చేయడంతో పాటు మరింతగా పంట రుణాలు ఇవ్వడం, కొత్తగా పంట రుణాలను రైతులకు అందజేస్తున్నారు. పంట రుణాలు ఇవ్వడం చాలావరకు బ్యాంకర్లు సులభతరం చేశారు. రైతులు వేసే పంటలను బట్టి రుణాలను మంజూరు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఎక్కువగా వరి పంటను సాగుచేస్తున్నారు. దీంతో 90 శాతానికి పైగా రైతులు వరి పంట సాగుపైనే క్రాప్ లోన్స్ పొందుతున్నారు. ఇదే సమయంలో పంటలకు కూడా బీమా చేస్తున్నారు. ఎకరం పంట రుణం రూ.30 వేలకు పైగానే ఇస్తున్నారు. 2021-22 సంవత్సరానికి గాను బ్యాంకర్లు తమ వార్షిక ప్రణాళికలను సిద్ధ్దం చేసుకున్నారు. 2021-22 సంవత్సర కాలంలో వానకాలం, యాసంగి రెండు పంటలకు కలిపి వార్షిక ప్రణాళిక సిద్ధమైంది. వానకాలం 2021కి గాను 1,68,704 ఎకరాలకు గాను రూ.1450 కోట్లు, 2021-22 యాసంగికి గాను 1,12,472 ఎకరాలకు గాను 965.31 కోట్లు, మొత్తం రెండు పంటలకు కలిపి 2,81,176 ఎకరాలకు గాను రూ. 2415.31 కోట్లు లక్ష్యం పెట్టుకున్నారు. ఆ దిశగా బ్యాంకర్లు రైతులకు పంట రుణాలను ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.
పంట పెట్టుబడులకు రంది లేకుండా వరుసగా ఏడోసారి రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. కరోనా-లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితులు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తుండడంతో రైతులోకంలో ఆనందం నెలకొంది. అర్హులందరికీ సాయం అందుతున్నది. వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ పరిస్థితుల్లో రైతుబంధు రావడంతో పంట పెట్టుబడులకు డబ్బులు అక్కరకు వస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 8,53,040 మంది రైతులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. 17.81 లక్షల ఎకరాలకు గాను రూ. 890.53 కోట్లను రైతుబంధు కింద ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రభుత్వం ఈ వానా కాలం అందజేస్తున్నది.
సిద్దిపేట జిల్లాలో రైతుబంధు వివరాలు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం 2018 మే నుంచి ప్రతి రైతుకు అందిస్తున్నది. తొలుత రెండు పంటలకు ఎకరాకు రూ.4వేల చొప్పున అందించింది. అనంతరం ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తున్నది. వరుసగా ఏడు పంటలకు సీఎం కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించారు. దీంతో దళారుల బెడద తప్పింది. ఈ ఏడు పంటలకు గాను సిద్దిపేట జిల్లాలోని రైతులకు ఇప్పటి వరకు రూ. 1,839.05 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. రైతులకు రైతు బీమా చేయించింది. రైతు ఏ కారణం చేత చనిపోయినా ఆ రైతుకు రూ. 5 లక్షల బీమా పరిహారం చెల్లిస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కారణాల చేత 2277 మంది రైతుల చనిపోగా, వారి కుటుంబాలకు రైతుబీమా పథకం కింద రూ. 113.85 కోట్ల పరిహారం చెల్లించారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి..
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషిచేస్తున్నది. రైతులు విత్తు విత్తిన నాటి నుంచి పంట కొనుగోలు వరకు ప్రభుత్వమే చూసుకుంటున్నది. చినుకు పడకముందే రైతులకు పంట పెట్టుబడి కింద రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమచేసింది. ఇప్పటి వరకు వరుసగా ఏడు పంటలకు రైతుబంధును అందించింది. వివిధ కారణాల చేత చనిపోయిన రైతులకు రైతుబీమా కింద ఒక్కో రైతుకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నది. వానకాలం సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాం. నకిలీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండే విధంగా ప్రతి క్లస్టర్‌కు ఒక అధికారిని నియమించాం. జిల్లాలో 127 రైతు వేదికల నిర్మాణం పూర్తయింది. రైతు వేదికల్లో రైతుల సమావేశా జరుగుతున్నాయి. జిల్లాలో ఈసారి కొత్తగా ఆయిల్‌పామ్‌తో పాటు వెదజల్లే పద్ధ్దతిలో వరి సాగును ప్రోత్సహిస్తున్నాం.
రైతుల జేబుల పైసలుంటన్నయి..
పంట వేసే ముందే రైతుబంధు డబ్బులు అకౌంట్లో పడి పెట్టుబడి కి ఇబ్బంది లేకుండా అయ్యింది. ఇదివరకు ఎవరో ఒక షావుకారి దగ్గర బాకి తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడట్ల లేదు. ప్రభుత్వమే పైసలిచ్చుడుతో మాకు ఆ బాధలు తప్పినయి. ఆ పైసలతోనే మందు బస్తాలు, విత్తనాలు తెచ్చుకుంటన్నం రైతుల జేబులో పైసలుంటన్నయి. ఇలాంటి రోజులు తెచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
-యాసరేణి రాములు,రైతు,జాలపల్లి