సిద్దిపేట, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు, ఇప్పుడు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మద్దతుగా నిలుస్తున్నారు. జాతీయస్థాయిలో ఆ పార్టీ బలోపేతానికి తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. అన్నివర్గాల ప్రజలతో పాటు వివిధ సంఘాలు, సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళలు ప్రకటిస్తున్నాయి. దీంతో ఊరువాడా కోలాహలంగా మారింది.
ముందున్న సిద్దిపేట…
ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేటలో ఊరూవాడ కదిలింది. విద్యార్థిలోకం కదం తొక్కుతున్నది.గ్రామాల్లో కులాలకు అతీతంగా అంతా ఒక్కటవుతున్నారు. ఒక్కటే నినాదం… జైటీఆర్ఎస్.. జైబీఆర్ఎస్.. జైకేసీఆర్ అంటున్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన ఈగడ్డ.. ఇవాళ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని స్వాగతిస్తున్నది. తమకు తోచిన విధంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. మూడు రోజులుగా సిద్దిపేట నియోజకవర్గంలో వివిధ వర్గాలకు చెందిన వారంతా తమ విరాళాలను పార్టీ ప్రతినిధులకు అందజేస్తున్నారు. రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం అన్నింటా ముందున్నది. బీఆర్ఎస్కు విరాళాల్లలోనే ముందున్నది. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రామాల వారీగా పార్టీకి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది.
ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వివిధ కుల సంఘాలు, అసోసియేషన్లు సైతం తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటిస్తూ బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నాయి. శనివారం సిద్దిపేట నియోజకవర్గం ప్రైవేటు ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ వారు రూ.10 వేలు, హౌసింగ్ బోర్డు చైతన్యపురి కాలనీ వడ్డెర సంఘం వారు రూ.10 వేలు, జిల్లా ఫొటోగ్రాఫర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు రూ.15 వేలు విరాళం అందజేశారు. ఆదివారం చిన్నకోడూర్ మండలం గంగాపూర్ గ్రామ యాదవ సంఘం సభ్యులు రూ.10 వేలు, విఠలాపూర్ యువజన సంఘం రూ.20 వేల విరాళం ఆదివారం
సోమవారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని రంగాధాంపల్లి తరపున (మూడో వార్డు)లో 1,11,111 రూపాయలను స్థానిక కౌన్సిలరు వంగ రేణుక తిరుమల్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఇతర పార్టీ నాయకులు విరాళంగా ప్రకటించి పార్టీ ప్రతినిధులకు అందించారు. సిద్దిపేట పట్టణంలోని మాల సంఘం ఆధ్యర్యంలో కౌన్సిలర్లు సాకి బాల్‌లక్ష్మి, గ్యాదరి రవీందర్, సంఘం అధ్యక్షుడు భూమయ్య, మహంకాళి రూ.50,116 విరాళంగా ఇచ్చారు. నంగునూరు మండలం జేపీ తండా గ్రామసర్పంచ్ భిక్షపతి నాయక్ నేతృత్వంలో ఎస్టీ సంఘం రూ. 7వేలు, ముదిరాజ్ సంఘం రూ. 3వేలు పార్టీ మండల నాయకులకు విరాళంగా అందించారు. సిద్దిపేట నియోజకవర్గం స్ఫూర్తితో ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఇతర నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేందుకు ప్రజలు, సంఘాలు, సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ నాయకులు చెబుతున్నారు.
విద్యార్థి నాయకుల సంబురాలు
సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) విద్యార్థి విభాగం అధ్యక్షుడు మెరుగు మహేశ్, ఇతర నేతల ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల ఆవరణలో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. పార్టీకి మద్దతుగా ఒక్కో విద్యార్థి ఒక్క రూపాయి చొప్పున విరాళం ఇచ్చారు. ఇలా రోజురోజుకూ టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దీంతో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో ఫుల్‌జోష్ నెలకొంది.
చరిత్రగతిని మార్చే నాయకుడు
బీఆర్ఎస్తో చరిత్రగతిని మలుపు తిప్పగల మహా నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన తలపెట్టిన ప్రతికార్యం దైవ సంకల్పంతో విజయవంతమవుతుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కూడా దేశ ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది. దేశ ప్రజలందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతోనే జాతీయ రాజకీయల్లోకి వస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ సంచలనానికి కేంద్ర బిందువు అవుతుంది.
– రోజాబాల్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బొల్లారం
బీఆర్ఎస్తో దేశాభివృద్ధి..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో అన్నివర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటునానరు. దేశం ఆర్థికంగా దెబ్బతింటున్నది. సీఎం కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీతోనే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు తగు న్యాయం జరుగుతుంది. బీజేపీ అసమర్థ విధానాలు, పాలనతో దేశ ప్రజలు పూర్తిగా విసిగి పోయారు. పరిపాలనా దక్షిత కలిగిన నాయకుడు కేసీఆర్ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
– సత్తు నరేందర్‌రెడ్డి, వ్యాపారవేత్త, మిరుదొడ్డి
బీఆర్ఎస్తోనే దేశానికి ప్రయోజనం
తెలంగాణ పథకాలు బాగున్నాయి. మనవద్ద ప్రభుత్వ నుంచి అందరికీ మేలు జరుగుతున్నది. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ దేశ స్థాయిలో విస్త్తరిస్తే దేశానికి ప్రయోజనంగా మారుతుంది. మాలాంటి క్షౌరశాలలకు ఉచితంగా విద్యుత్ అందించి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశంలో ఈ పథకం విస్త్తరిస్తే చాలామందికి ప్రయోజనం కలుగుతుంది. కేసీఆక్ ప్రజల బాగుకోరే నాయకుడు.
– తంగళ్లపల్లి మహేశ్,నాయీబ్రాహ్మణుడు, బెజ్జంకి
దేశానికి కేసీఆర్ సేవలు అవసరం..
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చడం మంచి నిర్ణయం. తద్వారా దేశానికి మేలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దేశానికి అన్నిరంగాల్లో తెలంగాణ ఆదర్శంగా మారింది. తెలంగాణ మాడల్ దేశానికి ఇప్పుడు అవసరం. దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.జాతీయ రాజకీయాల్లోనూ ఆయన విజయం సాధిస్తారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు.
– రణం శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)
దౌల్తాబాద్ మండల మండల అధ్యక్షుడు
ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్
శంలోని వివిధ రాష్ర్టాల్లో ప్రజలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఉన్న స్థితిగతులపై కేసీఆర్‌కు పూర్తిస్థాయి అవగాహన ఉన్నది. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లడం శుభపరిణామం. బీజేపీకి బుద్ధి చెప్పాలంటే ఆయనతోనే సాధ్యమవుతుంది. కేంద్రం అనేక రంగాల్లో విఫలమైంది. ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకోలేకపోతోంది. రూపాయి విలువ పడిపోతోంది. నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయి. సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకపక్షంగా అనేక చట్టాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఇతర రాష్ర్టాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దేశ ప్రజలు కేసీఆర్‌కు మద్దతు తెలిపితే దేశమంతటా తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు అమలయ్యే అవకాశం ఉంటుంది.
మరో చరిత్రకు నాంది..
భారత్ రాష్ట్ర సమితితో సీఎం కేసీఆర్ మరో చరిత్రను సృష్టించబోతున్నారు. ప్రస్తుత సమయంలో దేశ ప్రజలకు కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం. పేదల సంక్షేమం ఆయనతోనే సాధ్యం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ధరల పెరుగుదలతో పేదలు బతుకలేని పరిస్థితి నెలకొన్నది. రాబోయే రోజుల్లో కేంద్రానికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అవుతుంది.
– రాములుగౌడ్,తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్
దేశ్‌కీ నేత సీఎం కేసీఆర్
దేశరాజకీయాల్లో కీలకపాత్ర వహించడానికి టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధినేత సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయడం శుభసూచకం. కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించాలని అన్ని రాష్ర్టాల ప్రజలు, నాయకులు ఆశీస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ సార్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తారన్న నమ్మకం ఉంది.
– చక్రపాణి, టీఆర్ఎస్ మండల నాయకుడు, బొంతపల్లి, గుమ్మడిదల మండలం
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం..
సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. సిద్దిపేట నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్, నేడు బీఆర్ఎస్ ద్వారా దేశ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్‌లోనూ ఆయన ఉన్నత పదవులు సాధించాలని భగవంతున్ని కోరుకుంటున్నా.
– సంగు పురేందర్,ఏఎంసీ మాజీ చైర్మన్ సిద్దన్నపేట, నంగునూరు