ఆవులు.. అతడికి పంచప్రాణాలు.. పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటాడు.. వాటిని విడిచి ఎక్కడికి వెళ్లడు. వాటిని మేతకు తీసుకెళ్లడం.. రాత్రి కట్టేయడం.. పొద్దున్నే ఆవుల పేడ తీయడం.. పశువుల బాగోగులు చూసుకోవడం ఆయన దినచర్య. ఇలా ఒకటి, కాదు రెండు కాదు.. 50 ఏండ్లుగా ఇదే చేస్తున్నాడు
కొమురవెల్లి మండలం గురువన్న పేటకు చెందిన రైతు బ్రహ్మండ్లపల్లి రాజయ్య. సుమారు 40కి పైగా ఆవులను పోషిస్తూ ఆనందంగా గడుపుతున్నాడు.
కొమురవెల్లి, సెప్టెంబర్ 3: నాడు పల్లెటూరు అనగానే దాదాపుగా ఇంటింటికీ ఆవులు ఉండేవి. వ్యవసాయరంగంలో మార్పులు సంభవించడంతో వ్యవసాయ పనుల్లో రైతులు యాంత్రీకరణ ఉపయోగిస్తుండటంతో నానాటికి ఆవుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. నేడు చూద్దామన్నా దేశీయ ఆవులు కంటపడని పరిస్థితి ఉంది. కానీ, కొమురవెల్లి మండలం గురువన్నపేటలో రైతు బ్రహ్మండ్లపల్లి రాజయ్య మాత్రం ఒకటి కాదు రెండు కాదు సుమారు 40కి పైగా ఆవులను కాస్తూ గో సేవకుడిగా మారాడు. రాజయ్య 50 ఏండ్ల నుంచి ఆవులను సంరక్షిస్తున్నాడు. చిన్ననాటి కాలంలో తన తండ్రి సైతం ఆవులను సంరక్షించారని, తాను కూడా తండ్రి బాటలో నడుస్తున్నానన్నాడు. 40కి పైగా ఆవుదూడలను ప్రతిరోజు ఉదయం సాయంత్రం మేతకు తీసుకెళ్లడంతో పాటు రాత్రి సమయంలో తన వ్యవసాయబావి వద్ద ఉన్న చింతచెట్టు కింద కట్టేసి, వాటికి వరి గడ్డి వేయడంతో పాటు మళ్లీ ఉదయం తెల్లవారుతుండగానే వ్యవసాయబావి వద్దకు చేరుకొని ఆవుల పేడ తీసి, ఒక దగ్గర చేర్చడం రాజయ్య దినచర్య.
వేకువజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లే రాజయ్య ప్రతి రోజు ఆవుల పాలన చూసుకుంటూ తన భార్య రాజవ్య, కుమారుడు రజినికాంత్ సహకారంతో తనకున్న నాలుగెకరాల భూమితో పాటు రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని నిల్వ చేసిన ఆవుల పేడను ఎక్కువగా రసాయన ఎరువులు లేకుండా నామమాత్రంగా వాడుతూ పంటలను సాగు చేస్తున్నాడు. రెండేండ్ల కోసం తన పొలంలో ఎరువును వేస్తాడు. మరో యేడాది ఎరువు రైతులకు అమ్మడం ద్వారా రాజయ్యకు రూ.80 వేల వరకు ఆదాయం వస్తున్నది. 40కి పైగా ఉన్న ఆవుదూడల మేతకు తన పొలంలోని గడ్డి కేవలం రెండు మూడు నెలల్లోనే అయిపోతుండటంతో ఇతరుల వద్ద వరిగడ్డిని కొని, ఆవులకు మేత వేస్తాడు. 50ఏండ్లుగా ఆవులను బీడు భూముల్లో మేపుతున్న రాజయ్య ఇటీవల పెరిగిన భూగర్భజలాలతో చాలా మంది రైతులు పొలాలను అచ్చు కట్టడంతో ఆవులను కాసేందుకు రాజయ్యకు ఇబ్బందిగా మారింది. గియన్ని ఆవులు ఎందుకు అమ్మరాదని రాజయ్యను అడిగితే, కొన్నవాళ్లు వాటిని సాకుతారనే గ్యారంటీ ఏందీ? అని ప్రశ్నిస్తాడు. ఏది ఏమైనా 65ఏండ్ల వయస్సు ఉన్న రాజయ్య 50ఏండ్లుగా ఎక్కడికి వెళ్లకుండా ఆవులకు సేవ చేస్తూ గో సేవకుడిగా మారాడు.