సిద్దిపేట, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం మన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ‘నిపుణ’ పేరిట ప్రత్యేక సంచిక ఇస్తున్నది. ఇందులో భా గంగా అభ్యర్థుల సౌలభ్యం కోసం 2022 ఏప్రిల్ 2 నుంచి ప్రతి రోజూ జిల్లా టాబ్లాయిడ్లో నాలు గు పేజీలు (ఇంగ్లిష్, తెలుగు మీడియంలో), ప్రతి బుధవారం ఎనిమిది పేజీల ప్రత్యేక అనుబంధం ఇస్తున్నది. అంతేకాకుండా ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి ఉచిత అవగాహన కల్పించాలనే సంకల్పంతో బుధవారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది.
భయం తొలిగించి.. భరోసా కల్పించేలా..
ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో భయం తొలిగించి, భరోసా కల్పించేలా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ నిపుణుల సలహాలు, ప్రామాణిక స్టడీ మెటీరియల్ అందిస్తున్నాయి. తాజాగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న సమయంలో అభ్యర్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో బుధవారం ఉదయం 10గంటలకు నిర్వహించే ఈ సదస్సుకు సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప వక్తలుగా హాజరవుతున్నారు. ఆత్మీయ అతిథులుగా ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తదితరులు పాల్గొంటారు.