సిద్దిపేట కమాన్, జూన్ 9 : ప్రజా ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనడానికి నిదర్శనం బస్తీ దవాఖానలు. పేదల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేటలోని కేసీఆర్‌నగర్‌లో గతంలో తాత్కాలిక భవనంలో బస్తీ దవాఖాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి హరీశ్‌రావు కృషితో రూ.18 లక్షలతో ఇటీవల పక్కా భవన నిర్మాణం పూర్తయింది. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా బస్తీ దవాఖాన ప్రారంభంకానున్నది. దీనితో కేసీఆర్‌నగర్‌లో పేదలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పక్కా భవనం ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్‌నగర్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన వైద్య సేవలు.. అన్ని రకాల ఉచిత పరీక్షలు..
బస్తీ దవాఖానలో అవుట్ పేషెంట్ సేవలు అందించడంతోపాటు 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. ఇక్కడ సేకరించిన రక్త నమూనాలను తెలంగాణ స్టేట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. సుమారు 150 రకాల మందులు ఉచితంగా అందిస్తారు. స్వల్పకాల అనారోగ్యానికి తక్షణ వైద్య చికిత్సలు అందించడంతోపాటు టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సెలింగ్ ఇస్తారు. ఇక ప్రజలకు బస్తీ దవాఖాన ఎంతో ఉపయోగపడుతుంది.