కోహెడ/హుస్నాబాద్ టౌన్/అక్కన్నపేట, జూన్ 10 : మండలంలోని శనిగరం ప్రాజెక్టుకు, గండిపేట కాలువలకు మరమ్మతులు చేయిస్తామని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌రావు అన్నారు. గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి శనిగరం ప్రాజెక్టు మత్తడి, తూములు కాలువలను ఆయన పరిశీలించారు. మత్తడి వద్ద కుడివైపు గోడ కూలిపోతున్నదని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, మాజీ సర్పంచ్ కర్ర రవీందర్ వివరించారు. రాగితూము వద్ద కుడి వైపు షటర్ పని చేయడం లేదని, తద్వారా ఒక పంట నీరు వృథాగా పోయిందని మురళీధర్‌రావుకు దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, వెంటనే మరమ్మతులు చేయించాలని జిల్లా అధికారులకు సూచించారు. గంగమ్మ తూము వద్ద కాలువ పూర్తిగా చెడిపోయిందని, దానికి మరమ్మతులు చేయాలని వివరించారు.
తంగళ్లపల్లి కాలువ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గండిపడి 350 ఎకరాలకు నీరు పోవడం లేదని ఎమ్మెల్యే చెప్పారు. తంగళ్లపల్లి వాగులో కట్టిన చెక్‌డ్యాం కుడివైపు కూలిపోయిందని, దాని ఎడమ పక్కన ఉన్న మట్టిని తీసేస్తే, చెక్‌డ్యాం నుంచి నీరు నేరుగా వెళ్లిపోతుందని వివరించారు. ఇందుకు ఆయన సమ్మతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు మరమ్మతుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, ప్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు, మాజీ సర్పంచ్ కర్ర రవీందర్, గజ్వేల్ సర్కిల్ ఇంజినీరింగ్ అధికారి హరిరామ్, పర్యవేక్షకులు బస్వరాజు, ఈఈ సాయిబాబా, డీఈ విద్యాసాగర్, ఏఈ రాజు, టీఆర్ఎస్ నాయకులు కొక్కుల సురేష్, పొన్నాల లక్ష్మణ్, నాగరాజు మధుసూదన్‌రావు, అబ్దుల్ రహీం, పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, కర్ర భిక్షపతి, ఎంపీడీవో కుమారస్వామి పాల్గొన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు సందర్శన..అధికారులతో సమీక్ష
గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్‌కు సంబంధించి ఎలాంటి సాంకేతిక పరమైన లోపాలు లేకుండా ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతం చేయాలని ఈఎన్సీ మురళీధర్‌రావు సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ప్రాజెక్ట్, ఇరిగేషన్ అధికారులతో కలిసి గౌరవెల్లి ప్రాజెక్ట్, రేగొండ వద్ద నిర్మించిన సర్జిపూల్ పంపుహౌస్‌ను ఆయన సందర్శించారు. అనంతరం ఈఎన్సీ మురళీధర్‌రావు ప్రాజెక్ట్ ట్రయల్న్,్ర నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్, ఇరిగేషన్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్‌కు పురోగతిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ త్వరలో నెరవేరబోతోందన్నారు. మెట్ట ప్రాంతమంతా గోదారి జలాలతో తడిసి సస్యశ్యామలంగా మారనుందన్నారు. వారం రోజుల్లో ట్రయల్ రన్ ప్రారంభిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఎలాంటి ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ శంకర్, ఎస్ఈ సుమతి, ఈఈలు రమేశ్, రాము లు, సాయిబాబా, హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఇరిగేషన్, ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.
ఎల్లమ్మ చెరువు సందర్శన
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువును ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి ఈఎన్సీ మురళీధర్ రావు సందర్శించారు. హుస్నాబాద్ ఎల్లమ్మచెరువు అభివృద్ధికి మరో రూ.2కోట్లు మంజూరు చేస్తామని మంత్రి హరీశ్‌రావు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో చెరువును అభివృద్ధి చేసేందుకుగాను ఈఎన్సీ ఎల్లమ్మ చెరువును పరిశీలించారు. ఎల్లమ్మచెరువు కొత్త తూమును ఎందుకు కూలిపోయిందనే విషయాన్ని ఆరా తీశారు. ఎల్లమ్మచెరువు సామర్థ్యం? అయకట్టు? తదితర వివరాలను ఈఎన్సీకి ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ వివరించారు. హుస్నాబాద్ ప్రాంత రైతులకు ఎంతో ముఖ్యమైదని, నిత్యం వందలాది మంది చెరువుకట్టపై వాకింగ్ చేస్తారని, ఆయా గ్రామాలకు సాగునీరు అం దించే పెద్ద చెరువు అని మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ తెలిపారు.