సిద్దిపేట అర్బన్/సిద్దిపేట, జూన్ 2 : 14 ఏండ్ల పాటు సుదీర్ఘ ఉద్యమం నడిపించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా కొత్త రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పట్టణ శివారులో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి హరీశ్‌రావుతో పాటు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, సీపీ శ్వేత, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి హరీశ్‌రావు, జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాలో ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని, తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతున్నందున జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ధిలో పరుగులు..
రాష్ట్రం సాధించిన అనతి కాలంలోనే సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలో కెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యమాన్ని ఎంతటి నిబద్ధతతో ముందుకు నడిపించారో, అంతే నిబద్ధతతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. పోరాట దశ నుంచి ఆదర్శ రాష్ట్రంగా అవతరింపజేసిన సందర్భం వరకు అంతా మన కండ్ల ముందు జరుగుతున్న అద్భుత చరిత్ర అని తెలిపారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాష్ర్టాన్ని నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రికి చేయూతనివ్వడం మనందరి బాధ్యతన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని, అప్పుడే మనం కలలు కంటున్న బంగారు తెలంగాణ సుసాధ్యం చేసుకోగలమని తెలిపారు.
వ్యవసాయరంగమే నిదర్శనం..
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని మంత్రి అన్నారు. ఈ మేరకు జిలాలో 2014-15లో 6 లక్షల 63 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసి, 11 లక్షల 59 వేల టన్నలు ఉత్పత్తి సాధిస్తే, 2021-22లో 8 లక్షల 61 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసి, 16 లక్షల 72 వేల టన్నుల ఉత్పత్తి సాధించిందన్నారు. ఇదే వ్యవసాయరంగ అభివృద్ధికి నిదర్శనమన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో రూ.2,140 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అదే విధంగా రైతుబీమా పథకానికి 2021-22 సంవత్సరానికి 1,79,085 మంది రైతులను అర్హులుగా గుర్తించామని, ఇప్పటి వరకు రైతుభీమా ద్వారా జిల్లాలో 653 మంది రైతులకు రూ.32 కోట్ల 65 లక్షలు బీమా సొమ్ము అందజేసినట్లు తెలిపారు.
ఇతర పంటగా ఆయిల్‌పామ్ సాగు..
జిల్లాలో కాళేశ్వరం జలాలు పుష్కలంగా లభ్యమవుతున్నందున ఇతర పంటగా ఆయిల్‌పామ్ సాగును 50,585 ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. గతేడాది 650మంది రైతులు 3వేల ఎకరాల్లో సాగు చేశారని, ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా జిల్లాలో 27వేల ఎకరాలకు ప్రభుత్వం ఆమోదం తెలుపగా, ఇప్పటి వరకు 8,250 ఎకరాల్లో సాగు చేశారన్నారు. అదే విధంగా 2014లో కేవలం 30 ఎకరాల్లో పట్టు సాగు చేస్తే, ప్రస్తుతం 790ఎకరాల్లో సాగు చేస్తూ 297 కుటుంబాలు ప్రతి రెండు ఎకరాల్లో సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం పొందుతున్నారన్నారు.
‘మనఊరు-మనబడి’తో వసతుల కల్పన
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల సమగ్ర అభివృద్ధి కోసం కావాల్సిన 12 అంశాల మౌలిక వసతులు కల్పించడం కోసం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఈ మేరకు జిల్లాలో మొదటి విడతలో రూ.89 కోట్ల వ్యయంతో 343 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకోసం జిల్లాలోని 3,600 మంది ఉపాధ్యాయులను సంసిద్ధులను చేసి, ఎస్సీఈఆర్టీ ద్వారా శిక్షణ ఇచ్చారన్నారు.
విప్లవాత్మక కార్యక్రమం.. దళితబంధు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళితజాతి ప్రగతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు అనే విప్లవాత్మక కార్యక్రమం ప్రవేశ పెట్టారన్నారు. దళితబంధు అనేది ఒక పథకం మాత్రమే కాదని, దళితులకు ఉపాధిని, ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని చేకూర్చే ఒక ధృక్పథం అన్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో దళితబంధు పథకం ద్వారా 495మంది లబ్ధిదారులకు రూ.49 కోట్ల 50 లక్షలను వివిధ రకాలుగా ఇచ్చామన్నారు.
అధునాతన మార్కెట్లు, రైతుబజార్లు..
జిల్లాలో రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు 26గోదాములు నిర్మించామన్నారు. సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో సమీకృత మార్కెట్లు, రైతుబజార్లను నిర్మించినట్లు చెప్పారు.చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో మిర్చి మార్కెట్, జగదేవ్‌పూర్, చిన్నకోడూరు, దుబ్బాక మండల కేం ద్రాల్లో కూరగాయల మార్కెట్లు, చేర్యాల, హుస్నాబాద్‌లో రైతుబజార్లు,గజ్వేల్‌లో పత్తి రైతుల కోసం 22 ఎకరాల్లో రూ.2 కోట్ల 24 లక్షలతో అధునాతన మార్కెట్ నిర్మాణంలో ఉందన్నారు.
కాళేశ్వరంతో మారిన రూపురేఖలు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంతో పాటు జిల్లా రూపురేఖలు మారనున్నాయని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మించిన ప్రాజెక్ట్‌గా కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్ర సృష్టించిందన్నారు. జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.77 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. మల్లన్నసాగర్లో 50 టీఎంసీలకు ప్రస్తుతం 14.43 టీఎంసీలు, కొండపోచమ్మసాగర్‌లో 15 టీఎంసీలకు ప్రస్తుతం 5.12 టీఎంసీలు, అనంతగిరి రిజర్వాయర్‌లో 3.5 టీఎంసీలకు ప్రస్తుతం 2.56 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కాళేశ్వరం జలాలతో జిల్లాలోని 3,516 చెరువులు, 3,267 చెక్ డ్యాంలు నింపామన్నారు. జిల్లాలోని 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్ పనులు 85పూర్తయినట్లు తెలిపారు.
ఇంటింటికీ సురక్షితమైన నీరు..
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వం ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు అందించాలన్న సదాశయంతో చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 752 ఆవాసాలకు రూ.1600 కోట్ల అంచనాలతో పనులు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 643 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, 2,268 కి.మీల పైప్‌లైన్ నిర్మాణం పూర్తయి, 2,03,370 గృహాలకు ప్రతిరోజూ తాగు నీరందిస్తున్నామన్నారు.
దక్షిణాదిలో తొలిసారిగా రుతుప్రేమ
దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా మహిళలు, బాలికల వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడే ముఖ్య ఉద్దేశంతో రుతుప్రేమ కార్యక్రమాన్ని సిద్దిపేటలో శ్రీకారం చుట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందు లో భాగంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు శానిటరీ కప్పుల వాడకంపై అవగాహన కల్పించి, జిల్లాలో 4 వేల మందికి రుతుప్రేమ కప్పులను అందించామన్నారు. అదే విధంగా సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 12 మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు, 72 క్యాటరాక్ట్ కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.41.38 కోట్ల వ్యయంతో 44,050 కేసీఆర్ కిట్లు అందించామన్నారు.
పేదలకు ఆత్మగౌరవంతో కూడిన ఇండ్లు..
పేదలకు గౌరవ ప్రదమైన సౌకర్యవంతమైన నివాసం ఉండాలని డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణ పథకం ప్రారంభించారని మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు 15,929 ఇండ్లను మంజూరు చేసి, ఇప్పటి వరకు 12,216 ఇండ్లు నిర్మాణం ప్రారంభించి, అందులో 9,253ఇండ్లు పూర్తి చేసుకొని, 4,613 ఇండ్లలో లబ్ధిదారులకు గృహ ప్రవేశం చేయించామన్నారు. ఈ పథకానికి ఇప్పటి వరకు రూ.609 కోట్లు ఖర్చు చేశామన్నారు.
సమగ్ర పల్లె ప్రగతికి శ్రీకారం..
గ్రామాలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలని, ప్రణాళిక పద్ధతిలో గ్రామాల అభివృద్ధి, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం జరగాలని పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలో 489 జీపీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి, 62 లక్షల మొక్కలు పెంచుతున్నారన్నారు. 489 జీపీల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు పూర్తయి, వినియోగంలో ఉన్నాయన్నారు. పల్లెప్రగతి ద్వారా జిల్లాలోని జీపీలకు ప్రతి నెలకు రూ.7.91 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు.
పట్టణ ప్రగతితో ఉత్తమ పారిశుధ్య సేవలు..
పట్టణ ప్రగతి పురస్కారాల్లో ఉత్తమ పారిశుధ్య సేవలు అందించినందుకు గానూ సిద్దిపేటకు ప్రథమ బహుమతి వచ్చిందన్నారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ సస్టెయినబుల్ సిటీగా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సిద్దిపేట, గజ్వేల్ మునిసిపాలిటీల్లో భూగర్భ మురుగు నీటి పారుదల నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ఆసరాకు రూ.37.22 కోట్లు
ఆసరా పింఛన్ పథకం ద్వారా జిల్లాలోని 1,68,8 88 మందికి ప్రతి నెలా రూ.37.22 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు.
హరితహారంతో మంచి ఫలితాలు..
జిల్లాలో 2021-22లో 40 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకొని, 42 లక్షల మొక్కలు నాటామన్నారు. వచ్చే సంవత్సరంలో 40లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు.
అడవుల పునర్జీవనం..
జిల్లా కలెక్టరేట్ వద్ద 138 హెక్టార్లలో తేజోవనం, గజ్వేల్ పట్టణం సంగాపూర్ వద్ద 117 హెక్టార్లలో కల్పక వనాలను అభివృద్ది చేశామన్నారు. తేజోవనం, కల్పకవనం, నగర పర్యావరణ ఉద్యానవనములు అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
విశాలమైన రోడ్లు..
జిల్లాలో రూ.172 కోట్ల అంచనా వ్యయంతో సిద్దిపేట నుంచి కిష్టాపూర్ వరకు 22 కి.మీ రెండు వరుసల నుంచి 4 వరుసల రహదారి నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. రూ.160 కోట్లతో సిద్దిపేట నుంచి చుట్టూ 74 కి.మీ రెండు వరుసల రిం గ్ రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు.
24 గంటల కరెంట్..
తెలంగాణలో 24 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు సహాయం
జిల్లాలో 2021-22 సంవత్సరంలో కల్యాణక్ష్మి పథకం ద్వారా 7,585 మందికి రూ.75.93 కోట్లు, షాదీముబారక్ ద్వారా 346 మందికి రూ.3.46 కోట్లు అందించామని తెలిపారు.
సత్వర సేవలకు ధరణి..
రైతాంగానికి సత్వర సేవలు అందించేందుకు ధరణి పోర్టల్‌ను ప్రారంభించి, రైతులకు సంబంధించి వివరాలను అందుబాటులో ఉంచేలా రూపొందించారన్నారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లే అవసరం లేకుండా తహసీల్దార్‌కు అధికారం బదలాయించామన్నారు. రిజిస్ట్రేషన్‌తో పాటు వెంటనే సంబంధిత మార్పిడి ఉత్తర్వులు యజమానికి అందుతున్నాయన్నారు. ధరణిలో నేటి వరకు జిల్లా వ్యాప్తంగా 6,252 రిజిస్ట్రేషన్లు, 310 పెండింగ్ మ్యూటేషన్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
ప్రజలకు చేరువయ్యేందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్
రాష్ట్రం ఏర్పాటైన వెంటనే ప్రభుత్వం పోలీస్ శాఖను పటిష్టం చేసిందన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని సమకూర్చి.. అధునాతన వాహనాలు అందజేసి ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేశామన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించి, నేరాలను అదుపు చేయడంలో నిరంతరం కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు. జిల్లాలోని 1,162 మంది నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్ ఉద్యోగం సాధించేందుకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు తీసుకెళ్లి నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరు సర్వతో ముఖాభివృద్ధి సాధనలో అందరూ భాగస్వాములై తమవంతు పాత్ర పోషించాలని, ప్రభుత్వానికి చేయూతనిచ్చి, ప్రతి ప్రభుత్వ కార్యక్రమం లబ్ధిదారులకు వందకు వందశాతం లబ్ధి చేర్చేలా కృషి చేద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలను, పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్లను మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.