సిద్దిపేట జిల్లా నెట్వర్క్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లాలోని అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, గజ్వేల్, చేర్యాల, చేర్యాల టౌన్, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, దుబ్బాక, దుబ్బాక టౌన్, తొగుట, రాయపోల్, బెజ్జంకి, కోహెడ, మిరుదొడ్డి, దౌల్తాబాద్, వర్గల్, హుస్నాబాద్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయన్ని చూసి సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధనకు శ్రీకారం చుట్టారన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎనిమిదేళ్లలోనే తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.