సిద్దిపేట, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడం, విద్యార్థుల నమోదు పెంచడం కోసం ఈ నెల 3నుంచి 30 వరకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. 3 నుంచి 10 వరకు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు గ్రామాల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు చేపడుతారు. పాఠశాలల పునః ప్రారంభం పండుగ వాతావారణంలో నిర్వహించే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాల్లో ‘మనఊరు-మనతబడి’ కింద రాష్ట్ర ప్రభ్వుం చేపట్టిన సంస్కరణలను వివరించి ప్రభుత్వ పాఠశాలలపై భరోసాను కల్పిస్తారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ‘మనఊరు-మనబడి’ కింద పాఠశాలలకు కొత్త అందాలు వస్తున్నాయి. విద్యార్థులకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశపెడుతుండడంతో పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరిపడా ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం నియమిస్తున్నది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల్లో మంచి విద్య అందనున్నది.
మనఊరు-మనబడి కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని తీసుకుంది. అన్నివర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ బడులను బతికించుకోవడం అందరి బాధ్యత. సర్కారు బడిలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెడుతుంది. ఇందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలోనైనా ఆంగ్లంతోనే ముడిపడి ఉంది. తెలుగు మీడియంలో చదివినప్పటికీ వారు ఆంగ్ల మాద్యమం విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. జిల్లాలో పేద మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు కొన్నేండ్లుగా ఆంగ్లమాద్యమంపై ఎక్కువగా దృష్టి సారించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభు త్వం గుర్తించి ప్రభుత్వ పాఠశాల్లో అన్ని వసతులను సమకూర్చి ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టాలనే ఉదేశంతో ‘మనఊరు- మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గనున్నది.
ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో తల్లిదండ్రుల సహకారం, వారి అభీష్టం మేరకు ఉపాధ్యాయులు ముం దుకు వచ్చి ఆంగ్ల మాద్యమాన్ని ప్రారంభించారు. దీంతో పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మూడు దశల్లో తీర్చిదిద్దనున్నారు. సిద్దిపేట జిల్లాలో 976 ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి జిల్లాలో 1239 పాఠశాలలు, మెదక్ జిల్లాలో 924 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం కింద పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తుంది. ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. తరగతి గదులతో పాటు శిథిలావస్థలో భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుంది. ప్రైవేట్ పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలోనే సుశిక్షితులైన ఉపాధ్యాయులున్నారు.
మొదటి విడతలో ఎంపికైన 343 పాఠశాలలు..
‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 343 ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ ఎంపిక చేసింది. ఇందులో 186 ప్రైమరీ పాఠశాలలు ఉం డగా, 33 ప్రాథమికోన్నత పాఠశాలలు, 124 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం సిద్దిపేట జిల్లా పరిధిలో 976 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 636 ప్రాథమిక పాఠశాలలు, 113 ప్రాథమికోన్నత పాఠశాలలు, 227 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడతలో ప్రభుత్వం 35 శాతం పాఠశాలలను ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఇందులో దౌల్తాబాద్ మండలంలో 12 పాఠశాలలు, దుబ్బాక మండలంలో 25, మిరుదొడ్డి 14, రాయపోల్ 10, తొగుటలో 14, గజ్వేల్ 20, జగదేవ్‌పూర్ 15, కొండపాక 20, మర్కూక్ 8, ములుగు 14, వర్గల్ 16, అక్కన్నపేట 22, హుస్నాబాద్ 10, కోహెడ 17, చేర్యాల 19, ధూళిమిట్ట 5, కొమురవెల్లి 6, మద్దూరు 8, బెజ్జంకి 12, చిన్నకోడూరు 19, నంగునూరు 18, నారాయణరావుపేట 6, సిద్దిపేట రూరల్ 10, సిద్దిపేట అర్బన్ 23 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో టాయిలెట్ల సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, ఫర్నిచర్, పేయింటింగ్, మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ నిర్మాణం, కిచెన్ షెడ్లు, కొత్త తరగతి గదులు, డైనింగ్ హాల్స్, డిజిటల్ విద్య అమలు తదితర పనులు ము మ్మరంగా కొనసాగుతున్నాయి.
జయశంకర్ బడిబాట లక్ష్యాలు
జిల్లాలోని అన్ని అవాసాల్లో పాఠశాల వయస్సు పిల్లలందరినీ గుర్తించడం, వారిని సమీప పాఠశాలల్లో నమోదు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదును పెంచడం, నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది. సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతారు. గ్రామ ఎడ్యుకేషన్ రిజిష్టరును నవీకరిస్తారు. అప్పర్ ప్రైమరీ పాఠశాల, ఉన్నత పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసిన పిల్లలను చేర్చుకోవడం, హైస్కూల్ 7,8 తరగతి పూర్తి చేసిన పిల్లలను నమోదు (వంద శాతం పిల్లల పరివర్తన). తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించడం, వారి సంఖ్యను పెంచడానికి తల్లిదండ్రుల ప్రమేయంతో ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారి వయస్సు ప్రకారం సంబంధిత తరగతిలో చేర్పించేందుకు కృషి చేస్తారు. బాలికల విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ప్రణాళికలను రూపొందించి తద్వార బాలికలందరూ పాఠశాలలో ఉంటారు.