గజ్వేల్, మే 31 : రాష్ట్రంలో కొత్తగా ఏర్పటైన కొత్తపల్లి, మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లలో గూడ్స్ రైళ్ల ద్వారా బియ్యాన్ని గోదాములకు సరఫరా చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఎఫ్‌సీఐ, రైల్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో కేంద్ర ఆహార సంస్థ, రైల్వేశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలైన్‌లో గజ్వేల్, కొడకండ్ల వరకు, మెదక్ రైల్వేలైన్ కూడా పూర్తయినందున ఈ లైన్లలో గూడ్స్ రైళ్ల ద్వారా బియ్యాన్ని గోదాములకు సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు.
గజ్వేల్‌లోని గోదాములను కొత్త రైల్వే లైన్లతో అనుసంధానానికి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ధాన్యం, ఎరువులను లైన్ల ద్వారా రవాణా చేస్తే స్థానిక రైతులకు, పౌరసరఫరాల వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సనత్‌నగర్, చెర్లపల్లి నుంచి కాకుండా ఈ కొత్త లైన్ల ద్వారా ధాన్యం, ఎరువుల రవాణాను చేపట్టాలని సూ చించారు. తద్వారా కాలాయాపన, వ్యయం చాలా తగ్గుతాయన్నారు. మంత్రి సూచనలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు. గూడ్స్ రైల్వే సర్వీసుల ద్వారా గజ్వేల్, మెదక్‌కు ఎరువులను రవాణా చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులు సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో మెదక్, మానకొండూరు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, గడా ముత్యంరెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.