సిద్దిపేట, మే 31 : యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సీపీ శ్వేత అన్నారు. మంగళవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కోమటి చెరువుపై డీఎంహెచ్‌వో డాక్టర్ కాశీనాథ్‌తో కలిసి 2కే రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కోప్టా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగవద్దన్నారు. 2కే రన్లో ప్రథమ స్థానంలో నిలిచిన కౌన్సిలర్ సాయికుమార్, రెండోస్థానంలో పాషాకు బహుమతులు అందజేశారు.
పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ పట్టణ వీధులగుండా నిర్వహించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ పొగాకు నమలడం, ధూమపానంతో క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ పొగాతో జరిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. డీఎంహెచ్‌వో కాశీనాథ్ మాట్లాడుతూ జిల్లా లో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో క్యాంపులు నిర్వహించగా, 176 మంది క్యాన్సర్ బాధితుల్లో 23 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్, 65 మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారన్నారు. కార్యక్రమంలో మంత్రి ఓఎస్డీ బాలరాజు, పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్‌రెడ్డి, డాక్టర్ వినోద్‌బాబ్జీ, డాక్టర్ ప్రభాకర్, చక్రధర్, సత్యనారాయణ, రాజేందర్ పాల్గొన్నారు.