ఝరాసంగం, మే 31: కొన్ని దశాబ్దాలుగా ప్రాశ్చాత్య సంస్కృతి ప్రాభల్యం కారణంగా సనాతన భారతీయ వైదిక సంస్కృతి వైభవం రానురానూ క్షీణిస్తున్నది. నేటి సమాజం వేద విద్యను ఆదరించడం లేదు. ధార్మిక సంస్థలు వైదిక విద్యాలయాల నిర్వహణకు ముందుకు రావడం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని విద్యాభ్యాసానికి పంపడంలేదు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్లో పురోహితులు,యజ్ఞయాగాలు చేసే వేదపండితులు, అర్చకులు కరువయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి స్థితిలో వేదవిద్యను, భారతీయ సంస్కృతిని కాపాడి పునరుద్ధరించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకుని ముందుకు సాగుతున్న దానిపై ప్రత్యేక కథనం..
పురోహితుల సంఖ్య పెంచేందుకు..
హైదరాబాద్ నుంచి ముంబాయి వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారి పై ఉన్న జహీరాబాద్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో దత్తగరి మహారాజ్ ఆశ్రమం ఉంది. ఇక్కడ 30 ఏండ్లుగా వైదిక పాఠశాలు కొనసాగిస్తున్నారు. యజ్ఞయాగాలు, విహహాది శుభకార్యాలు చేసేందుకు అవసరమయ్యే పురోహితుల కొరత తీర్చేందుకు ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవదూతగిరి మహారాజ్ అనూసూయ మాతల కృషితో వైదిక పాఠశాల కొనసాగుతున్నది. కులమతాలకతీంగా కేవలం నియమనిష్టలు, కట్టుబాట్లు పాటించే విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వేదవిద్యను బోధిస్తున్నారు. ఇప్పటి వరకు 11వందలకు పైగా విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది వారివారి స్వస్థలాల్లో అర్చకవృత్తిని కొనసాగిస్తూ స్థిరపడ్డారు.
ఉచిత బోధన, వసతి..
ఆశ్రమంలో వేదాలను అభ్యసించే విద్యార్థులకు ఉచిత బోధన, వసతిని కమిటీ సభ్యులు కల్పిస్తున్నారు. ఇందులో ప్రవేశానికి ఐదో తరగతి ఉత్తీర్ణత సాధించి 14 ఏండ్లలోపువారై ఉండాలి. కొత్తగా ప్రవేశం పొందే విద్యార్థులకు లింగదీక్ష ఇచ్చి విద్యాభ్యాసం ప్రారంభిస్తారు. ప్రతి విద్యార్థికి ఆరేండ్లపాటు శిక్షణ ఇస్తారు. ప్రవేశ, వర, కోర్సులు ( అర్చక, పౌరాహిత్య పోడశ సంస్కార విద్య) వేదాంత విజ్ఞానంపై బోధన ఉంటుంది. న్యాయ, యోగదర్శనం, భజన, గ్రంథపఠనం తదితరాలపై శిక్షణ ఇస్తారు. ఏటా 25 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.
అర్చకుల కొరత తీర్చడమే లక్ష్యం
ఊరూరా అర్చకుల కొరత తీర్చేందుకు కమిటీ సభ్యులు, భక్తుల సహకారంతో వైదిక పాఠశాల కొనసాగుతుంది. వేదపఠనం చేసిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ఆలయాల్లో అర్చకవృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి నాలుగేండ్ల కోర్సును ఆరేండ్లకు పెంచాం. దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. ప్రవేశం కోసం ఈనెల 10 తేదీ వరకు అవకాశం ఉంది. పాఠశాల భవన నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి పేద అర్చక విద్యార్థుల బోధనకు సహకరించాలి.
– ఆశ్రమ పీఠాధిపతి వైర్యాశిఖామణి అవదూత గిరి మహారాజ్ (బర్దీపూర్) సంగారెడ్డి జిల్లా