గజ్వేల్/ములుగు 5 : ‘వివిధ రకాల పండ్లు, ఉద్యానవన మొక్కల అభివృద్ధిని చేస్తున్న సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ పనితీరు ఎక్సలెంట్’.. అంటూ ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు. గురువారం ములుగులోని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు పక్కనే ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (ఫల పరిశోధనా కేంద్రం)లోని వివిధ రకాల పండ్ల మొ క్కలను మంత్రులు పరిశీలించారు. హైటెక్ నర్సరీని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, ఇతర మంత్రులకు ఆయిల్‌పామ్ సాగు, దిగుబడులు, ఉద్యానవన శాఖకు సంబంధించిన పంటల గురించి ఉద్యానవన శాఖ అధికారులు వివరించారు.
స్టాళ్లలో పట్టు పురుగుల పెంపకం చేపడుతున్న బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌కు చెందిన మంగ అనే మహిళా రైతును మంత్రి కేటీఆర్ పలుకరించారు. లాభం మంచిగొస్తుందా? ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు? అధికారులు చెప్పమంటే చెబుతున్నారా? లేక నిజంగానే మీకు లాభం వస్తుందా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘10 ఎకరాల్లో పట్టు పురుగులు పెంచుతున్నాం.. మరో 10 ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నా సార్.. మాకు భూమి లేదు.. వేరే వాళ్ల భూమిని కౌలుకు తీసుకొని చేస్తున్నా. పట్టు పురుగుల పెంపకంతో మొదటి పంట పోయినా ఆ తర్వాత ఏడాదికి ఎకరాకు రూ.లక్ష వరకు లాభమొస్తున్నది సార్’.. అని మంగ బదులిచ్చింది. మంగ మాటలు విని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇంకా బాగా వ్యవసాయం చేసుకోండి’.. అంటూ అభినందించారు. అంతకు ముందు ఇదే స్టాల్లో డ్రాగన్ ఫ్రూట్‌తో వైన్, జాము, కాస్మోటిక్స్‌ను తయారు చేసిన యువతిని అభినందించారు. స్టాళ్ల సందర్శన తర్వాత ఉద్యానవన శాఖ అధికారులతో మాట్లాడి, అధికారుల పనితీరు బాగుందని ప్రశంసించారు.
ఆయిల్‌పామ్ సాగుతో పాటు ఇతర ఉద్యానవన పంటల గురించి రైతులకు మరింత అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అనంతరం కేబినెట్ సబ్ కమిటీలో పాల్గొని, వానకాలం పంటల సాగు, ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కలెక్టర్ హనుమంతరావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, వీసీలు ప్రవీణ్‌రావు, నీరజాప్రభాకర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ ఎండీ కేశవులు, ఆగ్రోస్ ఎండీ రాములు, ఉద్యావన శాఖ జిల్లా అధికారి రామలక్ష్మి, ఇతర జిల్లాల అధికారులు పాల్గొన్నారు. కాగా, మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరు కాగా, వారందరికీ ఏఎంసీ చైర్మన్ జహంగీర్, ఎంపీపీ పెద్దబాల్ లావణ్య అంజన్‌గౌడ్, జడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్‌గౌడ్, టీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకులు జుబేర్ పాషా, స్థానిక నాయకులు స్వాగతం పలికారు.
మంత్రి సబితా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాల అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు.
పట్టు పురుగుల పెంపకంతో లాభం ఉందా?
పట్టు పురుగుల పెంపకంతో లాభం మంచిగొస్తుందా? ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు? అధికారులు చెప్పమంటే చెబుతున్నారా? లేక నిజంగానే మీకు లాభం వస్తుందా? అంటూ మంత్రి కేటీఆర్ బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌కు చెందిన మంగ అనే మహిళా రైతును ప్రశ్నిస్తున్న మంత్రి కేటీఆర్?