ప్రస్తుతం వ్యవసాయం రసాయనాల మయమైంది. రైతులు మోతాదుకు రసాయన ఎరువులు వాడుతున్నారు. దీంతో భూములు నిస్సారమవుతున్నాయి. సేంద్రియ పదార్థాలు, సూక్ష్మ పోషకాలు అంతకంతకూ పడిపోతున్నాయి. భూమిలో పోషక సామర్థ్యం పెంచేందుకు చెరువు మట్టి వాడడమే ఏకైక మార్గం. ముఖ్యంగా గ్రామాల్లో చెరువులకున్న ప్రాముఖ్యత చెప్పాల్సింది కాదు. చెరువుమట్టితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రసాయనిక ఎరువులకు మించి పోషకాలు చెరువు మట్టిలో ఉంటాయి. చెరువు మట్టిని పంట పొలాల్లో వేసుకోవడంతో పంటలు సమృద్ధిగా పండుతాయని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
రామాయంపేట/కల్హేర్, మే 1: నల్లమట్టి కోసం రైతులు ఎగబడుతున్నారు. ఉపాధి పనులు జరుగుతున్న చెరువుల వద్దకు వెళ్లి వంతుల వారీగా ట్రాక్టర్లతో తమ పంటచేలల్లోకి తరలించుకు వెళ్తున్నారు. ట్రాక్టర్లకు అద్దెలు చెల్లించి మరీ నల్లమట్టి తరలించుకుంటున్నారు. తమ చేలలో పోసుకుని చేనంతా చల్లుకుంటున్నారు. కొంతమంది రైతులైతే తమ పంట చేలలో కనీసం 12 అంగులాల ఎత్తున మట్టి పోసుకుంటున్నారు. చెరువులో పూడిక తీయగా వచ్చిన నల్లమట్టిని చేలల్లో పోసుకుంటే భూమిలో సారం పెరుగుతుంది. తద్వారా పంట దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం వేసవి కావడంతో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. కూలీలు తవ్విన పూడిక మట్టిన రైతులు తమ చేలల్లోకి తరలించుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దామరచెర్వు, రాయిలాపూర్, సుతారిపల్లి, శివ్వాయపల్లి గ్రామాలే కాకుండా జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పూడిక తీత పనులు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కల్హేర్, అందోల్, రాయికోడ్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో చెరువుల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. దీంతో రైతుల నల్లమట్టి తరలించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
చెరువు మట్టిలో పోషకాలు..
వర్షాలు బాగా కురిసినప్పుడు ఎత్తయిన ప్రదేశాల నుంచి వర్షపు నీటితో పాటు ఇసుక, బంకమట్టి, ఒండ్రుమట్టి, వివిధ ప్రాంతాల్లో కుళ్లిన వ్యర్థ పదార్ధాలు కలిసి చెరువులోకి చేరుతాయి. చెరువులో నీరు ఉన్నంత కాలం లోపలే కుళ్లి మంచి సేంద్రియ కర్భనంగా మారుతుంది. చెరువు మట్టిలో 70 శాతం ఒండ్రు, 30శాతం బంకమట్టి, పంటలకు అవసరమయ్యే నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు సూక్ష్మపోషకాలు ఉంటాయి. చెరువు మట్టి భూముల్లో వేయడంతో నీటినిల్వ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
భూసారం పెరుగుతుంది..
నల్లమట్టి వేస్తే భూముల్లో భూ సారం పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. అందుకే ఎక్కువ శాతం రైతులు చెరువుల్లోని నల్లమట్టిని తీసుకెళ్తారు.ఇది ఎక్కువ శాతం పడావు భూముల్లో రైతులు వేసుకుంటారు. ఎందుకంటే పడావు భూముల్లో భూసారం తక్కువగా ఉండి పంటలు పండవు. పంటలు పుష్టిగా పండాలంటే భూసారం ఎక్కువగా ఉండే నల్లమట్టినే పడావు నేలల్లో వేయాలి.
-రాజ్‌నారాయణ, వ్యవసాయ అధికారి రామాయంపేట (మెదక్ జిల్లా)
నల్లమట్టిని పోటీపడి తీసుకెళ్తున్నారు..
నల్లమట్టిలో భూమికి కావాల్సిన పోషక విలువలు ఉంటాయి. ఇవి పంటలు పండడానికి దోహదపడతాయి. ప్రస్తుతం చాలా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. దీంతో రైతులు ఉపాధి పనులు జరిగే చోటకు వచ్చి నల్లమట్టిని ట్రాక్లర్ల ద్వారా అద్దె చెల్లించి మరి తీసుకెళ్తున్నారు.