బెజ్జంకి, ఏప్రిల్ 24: చాలాగ్రామాల్లో సర్వసాధారణంగా చాలా తక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులుంటారు. కానీ మండలంలోని చీలాపూర్‌లో వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు 70 మంది, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారు 102 మందికి పైగా ఉండటంతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గ్రామంలో ఎక్కువగా మధ్య తరగతికి చెందిన వారు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. కానీ తమ పిల్లలను చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్న ఆతల్లిదండ్రుల సంకల్పమే నేడు ఆగ్రామంలోఅనేక మంది ఉద్యోగులకు నిలయంగా చేసింది. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో చీలాపూర్ గ్రామం ఉన్నా రవాణా అంతంతే మాత్రమే ఉండేది. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు చీలాపూర్ బిడ్డలు. ఆనాడు ఉద్యోగం సాధించాలన్న దృఢసంకల్పం, పట్టుదలే మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగాలతో నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.. గ్రామంలో 1800జనాభా, 350 కుటుంబాలు, 1104 మంది ఓటర్లు ఉన్నారు. కీలక ప్రభుత్వ, ప్రైవేట్ శాఖల్లో గ్రామానికి చెందిన వారు ఉద్యోగాలు చేయడం విశేషం.
అన్ని శాఖల్లో వారే.. : గ్రామంలో 20 మంది ప్రాథమిక, ఉన్నత స్థాయి పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, ఎస్సై, ఆరుగురు పోలీస్ కానిస్టేబుల్, నలుగురు సింగరేణి, 10 మంది ఆర్టీసీ, ముగ్గురు చొప్పున పోస్టల్ డిపార్ట్మెంట్, ఆరోగ్య, పశుసంవర్ధక, రెవెన్యూ, ఐదుగురు విద్యుత్‌శాఖ, ఇద్దరు బ్యాంకు, ఎనిమిది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కపిల్ చిట్ ఫండ్ ప్రైవేట్ కంపెనీలో చాలామంది యువకులు పని చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో 102 పైగా మంది యువకులు వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈవ్స్ ద్వారా సామాజిక కార్యక్రమాలు
ఉన్న ఊరు కన్నతల్లి వంటిదనే నానుడికి నిదర్శనంగా ఉద్యోగస్తులందరూ కలిసి ఊరికి సేవచేయాలన్న సంకల్పంతో 2003 అక్టోబర్‌లో ఈవ్స్ (ఎంప్లాయీస్ వెల్పేర్ సొసైటీ చీలాపూర్) పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమవంతు సహాయంగా డబ్బులు జమచేసి చదువులో ప్రతిభ చూపుతున్న 7,10 తరగతులతోపాటు ఇంటర్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రతిభా పురస్కరాలు అందిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు అందించడంతోపాటు ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. గ్రామంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల్లో మేథాశక్తిని పెంపొందించడం, నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్య వంతులుగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులుండటం సంతోషం
గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రంగాల్లో ఉండటం సంతోషంగా ఉంది. గ్రామంలో అనేక మందిని చైతన్యవంతులుగా తీర్చిదిద్డడం మరువలేనిది. గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. గ్రామం లో మరికొంత మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నా.
-రావుల మొండయ్య, సర్పంచ్, చీలాపూర్