నిజాంపేట/ రామాయంపేట, ఏప్రిల్ 19 : యాసంగి ధాన్యా న్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ ఆదేశాలతో మండల స్థాయి వ్యవసాయాధికారులు ఏవో, ఏఈవోలు గ్రామాల్లో పర్యటించి, రైతులకు ధాన్యం కొనుగోళ్లపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందు లో భాగంగా మంగళవారం చల్మెడలో ఏఈవో గణేశ్, బచ్చురాజ్పల్లిలో ఏఈవో కావేరి పర్యటించి, రైతులకు ధాన్యం కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుంపులుగుంపులుగా ఉండకుండా వరసక్రమంలో ధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యంలో మట్టి, తాలు లేకుండా నాణ్యతా ప్రామాణాలు పాటిస్తూ అధికారులు, రైతులు ఒకరికొకరు సహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో బచ్చురాజ్పల్లి ఉపసర్పంచ్ మల్లేశం, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.
రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు
రామాయంపేట మండలవ్యాప్తంగా రైతులకు అందుబాటు లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఏఈవోలు సాయికృష్ణ, స్రంవతి తెలిపారు. సుతారిపల్లిలో ఏఈవో స్రవంతి, దామరచెర్వు, కాట్రియాల గ్రామాల్లో ఏఈవో సాయికృష్ణ రైతులకు ధాన్యం కొనుగోళ్లపై అవగాహన కల్పించా రు. పూర్తిస్థాయిలో ధాన్యం రాలేదని, కోతలు ప్రారంభమైన వెంటనే ఊరురా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది…
యాసంగి వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్ పేర్కొన్నారు. చేగుంట మండలంలోని రెడ్డిపల్లి సొసైటీలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడు తూ.. కేంద్రప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఆంజనేయులు, డైరెక్టర్లు జగతి, హరిశంకర్, బాల్రాజ్, మల్లేశ్, రమేశ్ పాల్గొన్నారు.