సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 10: సీఎం కేసీఆర్ కృషితోనే మండుటెండల్లోనూ గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం, సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలోని పట్టాభిరామ దేవస్థానంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ, శిఖర సంప్రోక్షణ, కల్యాణోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రిని గ్రామస్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో ఆహ్వానం పలుకగా, అర్చకులు పూర్ణకుంభంతో, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రి పట్టాభిరాముల కల్యాణ మహోత్సవానికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచనలతో గ్రామ పునర్నిర్మాణంతో పాటు పట్టాభిరాముడి ఆలయాన్ని కూడా నిర్మించుకున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా నీళ్లతో, పసిడి పంటలతో స్వామి వారి దయతో ఆనందంగా జీవిస్తున్నారన్నారు. చింతమడక అంటే చింతలు లేని మడకగా రూపుదిద్దుకుందన్నారు.
శ్రీరాముడు కుటుంబ సమేతంగా ఏకశిలా విగ్రహంపై ఉన్న ఆలయం చింతమడకలోనే ఉండటం గ్రామ ప్రజ ల అదృష్టమన్నారు. రాష్ట్రంలో యాదాద్రి ఆలయంతో పాటు అనేక ఆలయాలను పునర్నిర్మిస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ దేవాలయాల నిధులు ప్రభుత్వాలు ఉపయోగించుకున్నాయి. కానీ ప్రభుత్వ నిధులు దేవాలయాలకు ఇచ్చిన చరిత్ర లేదని, అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని అన్నారు. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా దేవుడి ఆశీస్సులు తీసుకుని ప్రారంభిస్తారని, నాడు తెలంగాణ ఉద్యమానికి బయల్దేరినపుడు కోనాయపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కృషి, స్వామి వారి దయతోనే గ్రామాల్లో ఏప్రిల్ నెలలో, మండుటెండల్లో చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన దాతలు, పని చేసిన వారందరిని మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. అనంతరం చింతమడక గ్రామంలో రూ.3 కోట్లతో పునరుద్ధరించనున్న శివాలయానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమం లో ఎంపీపీ శ్రీదేవి చందర్రావు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, సర్పంచ్ హంసకేతన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా రాములోరి పెండ్లి
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు దేవాలయాల్లో జరిగిన సీతారామ కల్యాణ మహోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. పట్టణంలోని 11వ వార్డులోని దాసాంజనేయ స్వామి, 13వ వార్డులోని బాలాంజనేయ, గణేశ్‌నగర్ ఆంజనేయ స్వామి, పాత గంజి దాసాంజనేయ స్వామి, 35వ వార్డులోని పారుపల్లి రావిచెట్టు హనుమాన్, పట్టణంలోని నాసర్‌పుర హనుమాన్ ఆలయాల్లో జరిగిన కల్యాణ మహోత్సవాలకు మంత్రి హాజరయ్యారు. పారుపల్లి సీతారామచంద్ర స్వామికి మంత్రి రూ. రెండు వేల కట్నం సమర్పించుకున్నారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, సుడా డైరక్టర్ మచ్చవేణుగోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, కౌన్సిలర్లు, శోభారాణి, మణిదీప్‌రెడ్డి, శ్రీలతాశ్రీహరి పాల్గొన్నారు.