కరువు నేల దృశ్యం మారింది.. సీఎం కేసీఆర్ అపరభగీరథ ప్రయత్నంతో ఉమ్మడి జిల్లా పచ్చగా మారుతున్నది. ఒకవైపు ఎండ అగ్గి కురిపిస్తుండగా, మరోవైపు ఎటు చూసినా గోదారమ్మ పరుగులు పెడుతూ జలసవ్వడులు చేస్తున్నది. వేల ఎకరాల పంటలకు జీవం పోస్తూ గంగమ్మ ముందుకు సాగుతున్నది. ‘నీరు పల్లమెరుగు’.. నానుడి తిరగరాస్తూ ‘నీరు ఎగువకు ప్రవహించును’.. అనేలా సీఎం కేసీఆర్ చేయగా, ఈ దృశ్యాలు చూసి రైతాంగం సంబుర పడుతున్నది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని కూడవెల్లి, హల్దీ వాగులు జీవ నదుల్లా మారాయి. వేసవిలో జిల్లాలోని చెరువులు అలుగు పారుతున్నాయి. కారణజన్ముడి కార్యదక్షతతో కరువు ప్రాంతాన్ని గోదావరి జలాలు ముద్దాడుతుండగా, అన్నదాత ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
సిద్దిపేట, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అపరభగీరథుడు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్దఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం చేశారు. ఇవాళ అగ్గి కురుస్తున్న ఎండల్లో ఎటు చూసినా గోదారమ్మ పరుగులు పెడుతూ జలసవ్వడులు చేస్తున్నది. ఇది చూసిన రైతాంగం సంబుర పడుతుంది. వేల ఎకరాల పంటలకు జీవం పోసింది. సిద్దిపేట, మెదక్ జిల్లాలోని కూడవెల్లి, హల్దీవాగులు జీవ నదుల్లా పారుతున్నాయి. మండు వేసవిలో గోదారమ్మ పరుగులు పెడుతుంటే జిల్లాలోని చెరువులు అలుగులు పారుతున్నా యి. ఎటు చూసినా గోదారమ్మ కనువిందు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నా యి. దశాబ్దాలుగా నెర్రె లు బారిన భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. గోదావరి నీటిని విడుదల చేయాలని ఈ ప్రాంత రైతులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు విజ్ఞప్తి చేయగా, వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతుల కోరిక మేరకు మార్చి 6న కూడవెల్లి, హల్దీవాగులకు గోదావరి జలాలను మంత్రి విడుదల చేశారు. దీంతో ఈ ప్రాంతంలోని కూడవెల్లి, హల్దీవాగులపై ఉన్న చెక్‌డ్యాంలు నిండుకుంటున్నాయి. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలోని చెక్‌డ్యాంలు నిండుకున్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో సుమారుగా 260కి పైగా చెరువులు నిండుకుండలా మారాయి.
కూడవెల్లి వాగు పరవళ్లు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మం డలం చేబర్తి వద్ద పుట్టిన కూడవెల్లి (కుడ్లేరు) వాగు అగ్గికురిసే ఎండల్లో ప్రవహిస్తున్నది. దీంతో వాగు జీవ నదిగా మారింది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని చేబర్తి పెద్ద చెరువు వద్ద కుడ్లేరు వాగు ప్రారంభమవుతున్నది. ఈ వాగు రాను రాను కూడవెల్లి వాగుగా పిలువబడుతున్నది. ఈ వాగుపై మొత్తం 39 చెక్‌డ్యాంలు నిర్మించారు. కూడవెల్లి వాగు గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూ క్, జగదేవ్‌పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంబీరావుపేట మండలంలోని ఎగువమానేరు వరకు ప్రవహిస్తున్నది. ప్రస్తుతం 23 చెక్‌డ్యాంలకు పైగా నిండి దుబ్బాక మండలం ఆకారం దాటి ఎగువ మానేరు వరకు గోదావరి నీళ్లు చేరుకున్నాయి. గజ్వేల్ కెనాల్ నుంచి మరికొన్ని చెక్‌డ్యాంలకు చెరువులను రెండు మూడు రోజులుగా నింపుతున్నారు.
జీవనదుల్లా హల్దీవాగు..
గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని తున్కిఖల్సా తపాల్ ఖాన్ చెరువు వద్ద పుట్టింది హల్దీవాగు. అక్కడి నుంచి ప్రారంభమైన వాగు నాచగిరి లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానం నుంచి మెదక్ జిల్లాలోకి హల్దీవాగు ప్రవహిస్తున్నది. ఈ వాగు వర్గల్, తుప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద మంజీరాలోకి, అక్కడి నుంచి నిజాంసాగర్ లో కలుస్తాయి. కొద్ది రోజులుగా సిద్దిపేట, మెదక్ జిల్లాలోని చెక్‌డ్యాంలు నిండుకుంటూ వెల్దుర్తి మండంలోని చెక్‌డ్యాం వరకు చేరుకున్నాయి. చౌదరిపల్లి బందం చెరువు నిండి అలుగు పారి వర్గల్ పెద్ద చెరువు, శాకారం ధర్మాయి చెరువు, అంబర్‌పేట ఖాన్చెరువులోకి అలుగు పారి హల్దీవాగులోకి చేరి వర్గల్ మండలంలోని తున్కిఖల్సా, అంబర్‌పేట, వేలేరు, నాచారంలలో మొత్తం 09 చెక్‌డ్యాంలు, మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం యావాపూర్, కిష్టాపూర్, తూప్రాన్, ఇస్లాంపూర్, నాగులపల్లి, నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో కలుపుకొని మొత్తం 13 చెక్‌డ్యాంలు నిండాయి. ఈ వాగుపై సిద్దిపేట, మెదక్ జిల్లాలో కలిపి మొత్తంగా 22 చెక్‌డ్యాంలు నిండాయి. దీంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హల్దీవాగు జీవనదిలా ప్రవహించడంతో పంటలకు జీవం పోసినైట్లెంది. చివరి దశలో ఉన్న పంటలు కాపాడిన సీఎం కేసీఆర్‌కు ఈప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సిద్దిపేట జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పెద్దఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. జిల్లా సరిహద్దులో అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మాణం జరుగగా.. దీని సామర్థ్యం 3.5 టీఎంసీలు ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ నీటి నిల్వ 2 టీఎంసీలు ఉంది. దీనికింద 30 వేల ఎకరాలు ఉంటుంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 2.32 టీఎంసీలు ఉంది. 1.10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నది. దీని ద్వారా కుడి ఎడమ కాల్వల నుంచి చెరువులు నింపుతున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి వచ్చే నీటితో సిద్దిపేట నియోజకవర్గంలోని చెరువులు అలుగు పారుతున్నాయి. తెలంగాణలోనే అత్యంత పెద్ద ప్రాజెక్టు మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 50 టీఎంసీలు ఉంటుంది. ప్రస్తుత నీటి నిల్వ 15.5 టీఎంసీలు ఉన్నాయి. ఈ రిజర్వాయర్‌ను గత ఫిబ్రవరి మాసంలోనే సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. దీనికింద 1.25 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తున్నది. ఈ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ, గంధమల్ల, సింగూరు, నిజాంసాగర్‌కు నీళ్లు వెళ్తా యి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గంలోని చెరువులు నిండుతున్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 5.8టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. మల్లన్నసాగర్ నుంచి వచ్చే ప్రధాన కాల్వ ద్వారా ఇటు కూడవెల్లి వాగుకు, అటు గంధమల్ల బస్వాపూర్‌కు వెళ్లాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు నీళ్తు వెళ్తున్నాయి.
పంటలకు నీళ్లందినయి..
హల్దీవాగును నమ్ముకొని పంటలను సాగు చేస్తుంటాం. గతంలో యాసంగి పంటలకు సాగునీరు ఇబ్బందిగా ఉండేది. పంటలను పూర్తిగా కాకుండా కొద్దిగా వేసేవాళ్లం. ఎండకాలంలో పంటలకు నీరు ఇబ్బందయ్యే సమయానికి గతేడాది నుంచి హల్దీవాగులో కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. దీంతో పంటలకు నీరందుతున్నాయి. హల్దీ ప్రాజెక్టుకు ఉన్న కుడి, ఎడమ కాలువల ద్వారా చుట్టు పక్కల గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుకుంటున్నాం. పశువులకు, జీవాలకు తాగునీరు, అవసరాలకు ఉపయోగపడుతున్నాయి.
– నారాయణరెడ్డి, రైతు కొప్పులపల్లి
ఎండకాలంలో నీళ్లు ఎన్నడూ చూడలేదు..
ఎండాకాలంలో వాగులో నీళ్లు ఎన్నడూ చూడలేదు. యాసంగి పంటలు వేయాలంటే నీళ్లను చూసుకొని భయపడుతూ ఉన్న భూమిలో కొంత పంట వేసుకునేటోళ్లం. కానీ పోయిన ఏడాది నుంచి పక్కా ఎండకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సీఎం కేసీఆర్ నీళ్లను వదులుతుండడంతో ఎప్పుడూ లేనిది హల్దీవాగులో నీళ్లు పారుతున్నాయి. చెక్‌డ్యాంలు మత్తడులు దుంకడంతో పంటలు సంతోషంగా సాగు చేసుకుంటున్నాం.
– నర్సారెడ్డి, రైతు కొప్పులపల్లి