కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై మోయలేని భారం పడుతున్నది. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వంటనూనెలు, స్టీల్, సిమెంట్ ధరలు చూస్తే మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు కుదేలవుతున్నారు. మార్కెట్లో ఏ వస్తువు ధర చూసినా భారీగా పెరిగింది. వేరుశనగ లీటర్ రూ.200 నుంచి రూ.230 చేరింది. పెట్రో, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.100 దాటాయి. నెల రోజుల వ్యవధిలోనే అందనంతగా ధరలు పెరిగాయి. సామాన్యులను ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదేంటి అంటే ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో ధరలు పెరిగాయంటూ వ్యాపారులు సమాధానం చెబుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాకుతో కేంద్ర ప్రభుత్వం పెట్రో,డీజిల్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచింది. దీంతో అన్ని వర్గాలపై ప్రభావం చూపుతున్నది. వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం అమాంతం పెంచింది. పెట్రోలియం ఉత్పత్తులతో పాటు కమర్షియల్ వంటగ్యాస్ ధర పెంచడంతో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్లో ఏ వస్తువు ధర చూసినా భారీగా పెరిగింది. వంటనూనెలు సలసల కాగుతున్నాయి. వేరుశనగ లీటర్ రూ.200 నుంచి రూ.230 చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.100 దాటాయి. సిమెంట్, స్టీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందామంటే కొనలేని పరిస్థితిలో ధరలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన పట్టణాలైన సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట, సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరువు, రామచంద్రాపూర్, జోగిపేట, నారాయణ్‌ఖేడ్, అమీన్పూర్ తదితర పట్టణాల్లో వంటనూనెలు, స్టీల్, సిమెంట్ ధరలు చూస్తే మండిపోతున్నాయి. యుద్ధం సాకుతో వ్యాపారులు కొంత మేర కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాత స్టాక్ మొత్తం కొత్త ధరలకు అమ్ముతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే సామాన్యుడికి అందనంతగా ధరలు పెరగాయి. ఇదేంటి అంటే యుద్ధం వల్ల ధరలు పెరిగాయి అంటూ వ్యాపారులు సమాధానం చెబుతున్నారు. ప్రస్తుత సమయం నిర్మాణ రంగానికి అనుకూలం కావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా పలు అభివృద్ధ్ది పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ స్టీల్, సిమెంట్‌పై ఆధారపడి జరుగుతున్న నేపథ్యంలో ఆప్రభావం జిల్లాపై పడింది.
సామాన్యుడికి ఇల్లు దూరమే..
ప్రస్తుతం పెరిగిన ధరలతో సామాన్యులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రోజు రోజుకూ సిమెంట్, స్టీల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంటి నిర్మాణాలు ప్రారంభించిన వారిపై ధరల పెరుగదల పెను భారం పడుతున్నది. టన్ను స్టీల్ ధరను పరిశీలిస్తే రూ.25 వేలకు పైగానే పెరిగింది. నెల రోజుల కిందట స్టీల్ క్వింటాల్ ధర రూ. 6,200 ఉండగా ప్రస్తుతం దీని ధర క్వింటాల్ రూ. 8,600 పెరిగింది. సిమెంట్ ధరను చూసుకుంటే అన్ని రకాల సిమెంట్లు సరాసరి ప్రతి బస్తాపైన రూ. 60 వరకు పెరిగింది. ధరలు పెరగడంతో నిర్మాణ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. నిర్మాణ రంగాలతో పాటు వివిధ అభివృద్ధి పనులుపై కూడా పెనుభారం పడిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం నిర్మాణాలకు అనుకూలమైన సమయం కావడంతో పెద్ద ఎత్తున నిర్మాణాలు కొనసాగుతున్నాయి.గత డిసెంబర్, జనవరి లో సిమెంట్ ధరలు చూస్తే రూ. 300, రూ.280 ఉన్నాయి. ప్రస్తుతం రూ.360 నుంచి రూ.390 వరకు పెరిగాయి. ఇంకా కొన్ని బ్రాండ్ సిమెంట్ ధరలు బాగానే ఉన్నాయని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు కుమ్మక్కై ధరలను ఇష్టారీతిగా పెంచారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పాత స్టాక్ ఉన్నప్పటికీ వాటిని విక్రయించకుండా కృత్రిమ కొరత సృష్టించి మరీ ధరలు పెంచి అమ్ముతున్నారు. ఏది ఏమైనా సామాన్యులను ధరలు ఉక్కిరిబిక్కిర చేస్తున్నాయి.
అమాంతం పెరిగిన నూనె ధరలు
నిత్యావసర సరుకుల్లో ప్రధానమైనది నూనె. గత నెల రోజుల్లోనే వీటి ధరలు బాగా పెరిగాయి. ధరలు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. రోజు కూలీ చేసుకునే ప్రజలపై ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం పడుతున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న నూనె ధరలను మా నెట్ వర్క్ పరిశీలించింది. నెల రోజుల కిందట ఉన్న ధరలు ప్రస్తుతం లేవు. ఒక్కో ప్యాకెట్ పై రూ. 80 నుంచి 100 వరకు పెరిగాయి. పాత స్టాక్‌ను సైతం కొత్త ధరల ప్రకారం అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలు పట్టణాల్లోని ప్రజలు ఆరోపిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు నూనె ప్యాకెట్లు కొంటారు.ప్రధానమైన నూనె ప్యాకెట్లలో గోల్డ్‌డ్రాప్, నట్గోల్డ్ తదితర నూనె ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి.ప్యాకెట్లు కాకుండా 5 లీటర్లు, 10 లీటర్లు, 15 లీటర్ల క్యాన్లు సైతం అందుబాటులో ఉన్నాయి.15 కిలోల టిన్ ధరను చూసుకుంటే నెల రోజుల కింద ఉన్న ధరకంటే సుమారుగా రూ.500 నుంచి రూ.700 వరకు పెంచారు.మొత్తంగా ఓ వైపు ఎండలు దంచికొడుతున్నాయి…మరోవైపు నూనె ధరలు సలసల కాగుతున్నాయి.
నూనె ధరలతో భారం అధికమైంది..
వంటనూనెల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలపై మరింత భారం పడుతున్నది.ఒక నూనె ప్యాకెట్ ధర గతంలో రూ.140 నుంచి రూ.150 వరకు ఉండేది. కానీ ప్రస్తుతం నూనెల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఒక్క నూనె ప్యాకెట్ ధర రూ.200 వరకు ఉండంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంటింట్లో ఏది వండాలన్నా నూనెల వాడకం తప్పనిసరి. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
తిరుపతిరెడ్డి ,రాయపోల్
భగ్గుమంటున్న వంట నూనె
వంట నూనె ధరలు రోజు రోజుకూ భగుమంటున్నాయి. నూనె కొనాలంటేనే భయం వేసి పరిస్థితి విచ్చింది. గతంలో వంట నూనెలు 100నుంచి 110 వరకు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఒక లీటరు నూనె ప్యాకెట్ రూ.200 వరకు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూనె ధరలను కట్టడి చేయకుంటే మున్ముందు ఇబ్బందులు తప్పవు.
-సంగమేశ్వర్,(మాయికోడ్)
స్టీల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు
ప్రస్తుత పరిస్థితిలో ఇల్లు కట్టుకోవాలంటేనే భయమేస్తున్నది.స్టీల్ ధరలు పెరగడం, సిమెం ట్ ధరలకు కూడా రెక్కలు రావడంతో ఇంటిని నిర్మించుకోలేక పోతున్నాం. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ స్టీల్, సిమెంటు ధరలను తగ్గిస్తేనే బాగుంటుంది. కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటుపోతున్నాయి. మధ్యతరగతి వారికి ఇబ్బందులు తప్పడంలేదు. ధరల పెరుగుదలకు కళ్లెం వేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలి.
-శారదా నాగరాజు, రామాయంపేట
ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేసే పరిస్థితి వచ్చింది
స్టీల్, సిమెంట్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసే పరిస్ధితి వచ్చింది. ప్రస్తుతం సిమెంట్, స్టీల్‌తో నిర్మాణాలు చేపట్టలేం. గతంలో తక్కువ ధరలో ఇల్లు నిర్మించుకునే వారు. కానీ, ప్రస్తుతం ఇల్లు కట్టాలంటేనే భయమేస్తున్నది. ధరల నియంత్రణకు కేంద్రం ప్రయత్నించాలి.
-లక్ష్మణ్ యాదవ్, రామాయంపేట
నూనెల ధరలు మండిపోతున్నాయి
వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. వాటికి తోడు పప్పుల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. మార్కెట్లో ఏది కొందామన్నా ఆలోచించాల్సి వస్తున్నది. ఇట్లనే ఉంటే ఏమీ కొనలేం. నూనెల ధరలను కేంద్రం బాగా పెంచుతున్నది. ధరల మూ లంగా మార్కెట్‌కు వెళితే రెండు వందలకు తక్కువ ఏ వస్తువులు దొరుకుతలేవు.
-సార్గు భాగ్యమ్మ ,
రాయిలాపూర్, రామాయంపేట
నూనెధరలతో మార్కెట్ చేస్తలేం
నూనె ధరలు మండిపోవడంతో మార్కెట్‌కు పోవాలంటేనే భయమేస్తున్నది. కూరగాయల ధరలు అంతంత మాత్రమే ఉన్నా నూనె ధరలు మాత్రం మండిపోతున్నాయి. కేంద్రం పెంచుకుంటూపోతే మధ్యతరగతి వాళ్లకు ఇబ్బందులు తప్పవు. కూలినాలి చేసుకుని బతికేటోళ్లం ఈ ధరలతో పూట గడవడమే గగనమైపోయింది.
-గొల్ల నారాయణ, నందిగామ, రామాయాంపేట
సొంత ఇల్లు కట్టుకోలేని పరిస్థ్ధితి
స్టీల్, సిమెంట్ ధరలు గతంలో ఎప్పుడూ లేనంతలా విపరీతంగా పెరిగిపోవడవంతో సొంత ఇల్లు కట్టుకుందామనుకునే సామాన్యుల ఆశ లు ఆవిరవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ధరలు అకాశాన్నంటుతుండడంతో పేదలకు భారంగా మారింది. స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి.
-రఘపతిరెడ్డి, తిమ్మక్కపల్లి
నిర్మాణాలు అగిపోవడం ఖాయం
పెరుగుతున్న సిమెంట్, స్టీల్ ధరలతో గృహ నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇదే విధంగా ధరలు పెరిగితే నిర్మాణాలు అగిపోతాయి. గతంలో ఎన్నడూ లేనంతలా యుద్ధం పేరుతో ధరలు పెంచుతున్నారు. దీంతో సామన్యులు ఇండ్లు కట్టుకోలేని పరిస్ధితి వచ్చింది. సిమెంట్ బస్తా ధర రూ.400, సలాక క్వింటాళులకు రూ.7600లకు చేరడం గతంలో ఎప్పుడూ చూడలేదు, వినలేదు. నిబంధనలకు విరుద్ధంగా ధరలు పెంచి విక్రయిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇల్లు నిర్మించుకోవాలనుకునే సామాన్యుల కల కలగానే మిగిలిపోతుంది.
-కుర్రారం బాల్‌నర్సయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు,చేర్యాల
నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు
వంటనూనెలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దీంతో మార్కెట్లో ఏ వస్తువు కొందామన్నా అగ్గిమండుతున్నాయి. దీంతో ఏమికొనేట్టు లేదు.. ఏమి తినేట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం నూనెల ధరలను అమాంతం పెంచుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. పెంచిన నూనెల ధరలను వెంటనే తగ్గించాలి.
-పిడిశెట్టి రాజు, మద్దూరు
నూనెల ధరల పెంపుతో ఇబ్బందులు
రెండు సంవత్సరాలుగా కరోనాతో సతమతమవుతూ ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇలాంటి టైంలో నూనెల ధరలు పెరగడం భరించలేని భారం. యుద్ధం కారణంగా ధరలు పెరగుతున్నాయని అంటున్నారు. ఒకరి మీద ఆధారపడడం ఎప్పటికైనా ఇబ్బందే. నూనెల ధరలు పెంపు మాత్రం సరికాదు
-బచ్చల బాలమణి,గృహిణి గురువన్నపేట
ధరల పెరుగుదలతో ఇబ్బంది
ఏ కూర వండాలన్నా మంచినూనె తప్పనిసరి. నూనె వేయకుండా చేస్తే కూర కమ్మగా ఉండదు. ఇప్పుడు దుకాణంలో కిలో మంచి నూనె కొందామంటే చాలా పిరం అయింది. ధరలను తగిస్తే మాలాంటి పేదవారికి మేలు జరుగుతుంది. ఇల్లు కట్టుకునే వారికి సిమెంట్, స్టీల్ ధరలు చుక్కలు సూపిత్తున్నాయి. సిమెంట్ ధరలను తగ్గించి ఆదుకోవాలని కోరుతున్నాం.
-ర్యాకం నర్సింహులు,రైతు, మిరుదొడ్డి
సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం…
కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్యుల నడ్డి విరిచేలా ఉన్నాయి. సిమెంట్, స్టీల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో పేదవాడు ఇల్లు కట్టుకునే అవకాశం లేకుండాపోతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ధరలు పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కమలం పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు.
-అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, శివసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి