యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేవరకు వదిలేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణ షురూ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా అధ్యక్షులు, ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం (నేడు) అన్ని మండల కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి నిరసన దీక్షలు చేపట్టనున్నారు. 6న జాతీయ రహదారులపై రాస్తారోకోలు, 7న అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నేతృత్వంలో నిరసనలు, 8న అన్ని గ్రామ పంచాయతీల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించింది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ధర్నాలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
ఇందుకోసం ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా నేడు (సోమవారం) అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేపట్టనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు జాతీయ రహదారులు ఉన్నా యి. ఒకటి సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారి, మెదక్ జిల్లాలో 44వ జాతీయ రహదారులు ఉన్నాయి. 7న అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నేతృత్వంలో నిరసనలు, 8న అన్ని గ్రామ పంచాయతీల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.
ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారు. కొన్ని నెలలుగా కేంద్రంపై వివిధ దశల్లో టీఆర్ఎస్ పోరాటాలు చేస్తూనే ఉన్నది. పైగా కేంద్ర మంత్రి తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. కేంద్రం తన వైఖరిని మార్చుకునే వరకు రైతుల పక్షాన పోరాటానికి టీఆర్ఎస్ తన కార్యాచరణను సిద్ధం చేసుకున్నది. రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విజ్ఞప్తి చేసింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. పైగా రైతులను చులకన చేస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన మాటలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత నెలలో కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీలు, సొసైటీ పాలక వర్గాలతో పాటు డీసీసీబీలు, మార్కెట్ కమిటీలు, డీసీసీఎంఎస్లతో పాటు మూడు జిల్లాల జడ్పీ పాలక వర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి పోస్టు ద్వారా తీర్మాన ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో టీఆర్ఎస్ ఐదంచెల ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైనది. రైతుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని టీఆర్ఎస్ నాయకత్వం తేల్చి చెబుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం తెలంగాణ రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్న విషయాన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు, నాయకులు విడమరిచి చెబుతున్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై ఎక్కడికక్కడ స్థానిక నాయకులు నిలదీస్తున్నారు.
కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపిస్తాం
దుబ్బాక, ఏప్రిల్ 3 : యాసంగి వడ్లు కొనుగోలు చేసేవరకూ కేంద్రాన్ని వదిలేది లేదని టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైతులను అవహేళన చేస్తున్న కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించినా స్పం దించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో పండించిన ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమ కార్యాచరణ పక్కాగా అమలు చేసి, కేంద్రం మెడలు వంచుతామన్నారు. ఈ నెల 8వరకు పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలో చేపట్టబోయే నిరసన దీక్షలో పాల్గొంటామన్నారు. మోదీ సర్కారుకు తెలంగాణ రైతుల సత్తాను ఉద్యమం ద్వారా చూపిస్తామన్నారు. నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, రైతులు పా ల్గొని విజయవంతం చేయాలని కోరారు.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ,టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
పంజాబ్ తరహాలో పంటను కొనాలి
తెలంగాణలో పండిన ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వం కొనాలి. ఇక్కడి రైతులపై కేంద్రం వివక్ష చూపుతున్నది. అన్నదాతల పక్షాన టీఆర్ఎస్ నిలబడుతుంది. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు నిరసన దీక్షలు చేపడుతాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాలేదు. కరోనా కష్టకాలంలోనూ ఏ సంక్షేమ పథకాలను ఆపకుండా సీఎం కేసీఆర్ అమలు చేశారు. బీజేపీ నాయకులకు ఇవి కనపడడం లేదా..? ముడి బియ్యం రావని తెలిసినా ముడిబియ్యం కొంటామని అనడం డ్రామా కాదా..? పంజాబ్‌లో పండించే పంటను ఎలా కొంటారు.. తెలంగాణ పంటను ఎందుకు కొనరో చెప్పాలి.
– పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు
రైతుల నడ్డివిరుస్తున్న కేంద్రం..
ఉద్యమాలతో స్వరాష్ట్రం సాధించిన విధంగా ధాన్యాన్ని కేంద్రం కొనే వరకు ఉద్యమిస్తాం. పంజాబ్ రాష్ట్రం నుంచి కొంటున్నట్లుగానే తెలంగాణలో పండిన ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలి. రాష్ట్రంలో బీజేపీ నేతల మాటలకు.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు పొంతనలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు రైతులకు మద్దతుగా నేడు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతాం. రైతుల నడ్డివిరిచే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వం మానుకోవాలి. రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి ధాన్యాన్ని సేకరించాలి. రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు మనుగడ సాధించిన దాఖలాలు లేవు. ఇది తెలుసుకుని మోదీ సర్కార్ ధాన్యాన్ని తీసుకోవాలి. లేకుంటే ఉద్యమాలు ఉధృతం చేసి కేంద్రం మెడలు వంచి ధాన్యాన్ని కొనిపిస్తాం.
– చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు