Siddipet | సిద్దిపేట, మే03: ధాన్యం కోనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్ ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో ఏర్పాటు చేసిన పీసీఏఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ శనివారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యంతో పాటు ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్, తేమ శాతం కొలిచే యంత్రాల పనితీరును పరిశీలించారు.
అనంతరం రైతులతో అదనపు కలెక్టర్ మాట్లాడి ధాన్యం కొనుగోలు చేయడానికి పట్టే సమయం గురించి అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వెంటనే తేమ శాతాన్ని చూసి, తూకం వేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ధాన్యం వివరాలను ఆన్లైన్ చేసి రైతులకు 48 గంటల్లో పేమెంట్ జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు చల్లని తాగునీరు సౌకర్యం కల్పించాలని సూచించారు.
నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
మెడికల్ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన యూజీ నీట్- 2025 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.