
సిద్దిపేటలో ఏ వైపు చూసినా పచ్చదనం.. రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదకర వాతావరణం.. మనస్సుకు హాయినిచ్చే చెట్లతో ఉద్యానవనంగా పట్టణం.. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారైంది. పట్టణంలోని ప్రధాన రోడ్డలన్నీ మొక్కలతో హరిత వనంగా మారింది. ఈ యేడు హరితహారంలో భాగంగా మున్సిపల్ పరిధి 2,93,300 మొక్కలు నాటడమే లక్ష్యంగా యంత్రాంగం ముందుకు సాగుతున్నది.
సిద్దిపేట, జూలై 10 : ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో సిద్దిపేట పట్టణంలో ఏ దిక్కు చూసినా ఆకుపచ్చగా దర్శనమిస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కలు 100శాతం బతికించడంతో పాటు మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టిన ఫలితంగా ప్రకృతి రమణీయంగా కనబడుతున్నది. ఇక్కడ మొక్కలు రక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. హరితహారం 2020-21లో 7.50 వేల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, 7,62,763 మొక్కలు నాటారు. ఇందులో 90 శాతం మొక్క లు సంరక్షించారు. తాజాగా 2021-22లో 2,93,300 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పట్టణంలో 96,371 మొక్కలు నాటారు. ఇందుకోసం పట్టణంలోని అన్ని వార్డులలో స్థలాలు గుర్తించారు. ఈ మొక్కల్లో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 1.50లక్షల మొక్కలు, డివైడర్ల మధ్యలో 81,600, కార్యాలయాల్లో 17,700, హోమ్సైట్ ఇతర చోట్లలో 44వేల మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. 15 రకాలైన మొక్కలను నాటనున్నారు.
మొక్కను పెంచు..
మానవాళికి మహోదయం తరువులే..
హరితవనం అందరికీ నవజీవన శుభోదయం..
స్వార్థం రెక్కలు తొడిగి, పుడమి ఒడిని బీడు చేయకు..
పరమార్థం మొగ్గ తొడిగి, ప్రకృతిని హరివిల్లుగా మారుద్దాం..
నీ పుట్టుకకు ఊయలై..
నీచావుకు కట్టెలై..
మానవత్వం పరిమళించే మరో బతుకు కథ వృక్షం..
కంటికి రెప్పలెంతో..
అవనికి చెట్టు అంతే..
తరువుతో చెలిమిని చేసి, తరతరాలు తరిద్దాం..
హరిత సిద్దిపేటే లక్ష్యం
మంత్రి హరీశ్‌రావు సహకారంతో పట్టణాన్ని హరిత సిద్దిపేటగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. పట్టణంలో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలు గుర్తించాం. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు నిరంతరం పని చేస్తున్నాం. ఈ సారి నిర్దేశించిన లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేస్తాం.
ప్రతీ మొక్క సంరక్షించేందుకు చర్యలు
సిద్దిపేట పట్టణంలో 2021-22లో 2,93,300 మొక్క లు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పట్టణంలో మొక్కలు నాటేందుకు గుంతలు తీసే కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే 96 వేల మొక్కలు నాటాం. పట్టణంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు చేపట్టాం.