
ఈ విధానంతో వరిలో అధిక దిగుబడి
ప్రతి గ్రామంలో 250 ఎకరాలు సాగు చేయాలి
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
క్షేత్రస్థాయిలో వరి వెద సాగు పద్ధతి పరిశీలన
సిద్దిపేట అర్బన్, జూన్ 1 : రైతులకు లాభం చేకూర్చడమే ధ్యేయంగా వ్యవసాయ శాఖ అధికారులు ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో వరిలో వెద సాగు చేస్తున్న పంగ ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి క్షేత్రస్థాయిలో సందర్శించారు. నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, రైతుబంధు సమితి నాయకులు, ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వెద పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ తన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసి, 42 క్విం టాళ్ల దిగుబడి సాధించారని చెప్పారు. ఈ వానకాలంలో సిద్దిపేట నియోజకవర్గంలో 20వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టు
కొని సత్ఫలితాలు సాధించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వెద పద్ధతిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ ఉండాలని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా సన్నరకం బియ్యం కొనుగోలు చేస్తామని, దొడ్డు రకం కొనమని కొర్రీలు పెట్టినట్లు.. కేరళ మినహా మిగతా చోట్ల దొడ్డు రకం కొనడం లేదన్నారు. సన్న బియ్యంతో రానున్న రోజుల్లో సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదముందని మంత్రి వివరించారు. పంటమార్పిడి పాటించాలని సూచించారు. పత్తి, కంది పంటలు పెడితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఆయిల్‌పామ్‌పై దృష్టి పెట్టాలని రైతులను కోరారు.
వెద పద్ధతి ద్వారా దిగుబడి అధికం..
వరిలో వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని మంత్రి అన్నారు. ఈ పద్ధతిలో సాగు చేసిన ఎల్లారెడ్డి అనే రైతుకు రెండు పంటలకు కలిపి ఎకరానికి 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. సాధరణ పద్ధతిలో కంటే దిగుబడి అధికంగా ఉంటుందన్నారు. విత్తనం తక్కువ అవసరం పడుతుందన్నారు. సాధరరణ పద్ధతిలో అయితే ఎకరానికి 25కిలోల విత్తనాలు అవసరమైతే, వెద పద్ధతిలో కేవలం 8 కిలోలు సరిపోతాయన్నారు. 30 నుంచి 35శాతం నీటి వినియోగం కూడా తగ్గుతుందన్నారు. 10-15 రోజుల ముందే పంట చేతికొస్తుందన్నారు. సుమారు ఎకరానికి రూ.6 వేల పెట్టుబడి తగ్గుతుందని, నాటు వేసే శ్రమ ఉండదని, రైతులు మూస పద్ధతికి స్వస్తి చెబుతున్నారన్నారు. వెద జల్లే పద్ధతిలో సాగు చేసి, మంచి ఫలితాలు సాధించిన రైతులు ఎల్లారెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. అనంతరం రైతులు తమ అనుభవాలు, సాగు పద్ధతులను రైతులు వివరించారు. ఈ సందర్భంగా రైతులను మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, మండల వ్యవసాయ అధికారి పరశురాంరెడ్డి, ప్రజాప్రతినిధులు, వ్యవసాయశాఖ ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి
టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు
మెదక్, జూన్ 1 : ఈ వానకాలంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. వానకాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలు ఏర్పాట్లపై మంగళవారం మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు సోములు, సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం, పీఏసీఎస్‌ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. వరికి బదులుగా పత్తి, కంది పంటలు వేసుకోవాలని, ఇక్కడ తెలంగాణలో పండించే పత్తి పంటకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, మంచి ధర కూడా పలికే అవకాశముందన్నారు. గతేడాది కంది క్వింటాలుకు రూ. 6 నుంచి రూ.7వేలు పలికిందని, ఈ యేడు కూడా పప్పు దినుసులకు భారీ డిమాండ్ ఉండనున్నదన్నారు. రైతులు ఈ రెండు పంటల వైపు మొగ్గు చూపేలా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. వెద పద్ధతిపై వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
65శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు
ప్రభుత్వం 65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేస్తున్నదని, దీనిని రైతులు ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేసేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యం నిల్వ కోసం గోదాముల నిర్మాణానికి ఆసక్తి గల సంస్థలు, వ్యక్తుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. వానకాల సీజన్‌కు సంబంధించి ఎరువులు, విత్తనాలు పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.