రాయపోల్ సెప్టెంబర్ 26 : పండగ నేపథ్యంలో అప్రమత్తత అవసరం బతుకమ్మ, దసరా పండగ సెలవులతో అనేక కుటుంబాలు సొంతూరి బాట పడుతుంటాయి. ఇలాంటి తరుణంలో ఇళ్లలో చోరీలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎస్సై కుంచం మానస ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా సెలవులకు ఆయా కుటుంబాలు సొంతూర్లకు వెళ్లే ముందు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తాళం వేసి ఉండే ఇళ్లలో చోరీలు జరిగే అవ కాశం ఉందని, దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలపై అవగాహన కల్పిం చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఊరికి వెళ్తున్నప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తద్వారా ఆ ప్రాంతంలో గస్తీ పెంచుతామని బంగారు నగలు, నగదును ఇంట్లో పెట్టి వెళ్లొద్దని సూచించారు. వాటిని బ్యాంకు లాకర్లో, నమ్మకం ఉన్నవారి వద్ద ఉంచాలన్నారు.
ఇంటి ప్రధాన ద్వారం తాళం కనిపించ కుండా డోర్ కటన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ప్రతి ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సీసీ కెమెరాలు అమర్చుకోవాలని గుర్తు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.