జహీరాబాద్, మార్చి 1: జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం రూ.24.40 కోట్లు మంజూరు చేసింది. కేంద్రప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా రైల్వేస్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం వేగంగా సాగడం లేదు. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల కోసం ఉన్న షెడ్లను కాంట్రాక్టర్ తొలిగించడంతో ఎండలో నిలిచి ఉండే పరిస్థితి నెలకొంది. స్టేషన్లో ప్రయాణికుల విశ్రాంతి గది ఉన్నా అవసరమైన కూర్చీలు లేక రైలు వచ్చే వరకు ఎండలో అవస్థలు పడుతున్నారు. వేసవిలోగా షెడ్ల నిర్మాణం పూర్తి చేస్తే ప్రయాణిలకు కొంత మేలు కలుగుతుంది. ఈనెల 5న ప్రధానమంత్రి మోదీ సంగారెడ్డికి వస్తున్నా రైల్వే అధికారుల్లో కదిక కనిపించడం లేదు.
జహీరాబాద్ పట్టణం వ్యాపార, వాణిజ్య కేం ద్రంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దులో పట్టణం ఉండడం తో ప్రతిరోజూ వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేయడంతో రైల్వే ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు వేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. గతంలో గడువులోగా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామ ని, రైల్వే అధికారులు ప్రకటించినా ఇంతవరకు పూర్తిస్థాయిలో పనులు ముందుకు సాగడంలే దు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలంలో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్)ను 12వేల ఎకరాల్లో ఏ ర్పాటు చేస్తున్నారు. దీంతో వ్యాపార, వాణిజ్య రంగం మరింత అభివృద్ధిచెందనున్నది.
జహీరాబాద్ రైల్వేస్టేషన్‌ను నిజాంకాలంలో నిర్మించారు. రైల్వేస్టేషన్లో ఉన్న భవనం, షెడ్లు చిన్నగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. దీంతో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కేంద్రం ఆధునీకరణ పనులు చేపట్టింది. రైల్వేస్టేషన్లో కొత్తగా భవనం, షెడ్లు నిర్మిస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. పార్కింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయగా, పార్కింగ్, పార్కు నిర్మాణ పనులు ప్రారంభించ లేదు. విశ్రాంతి గదులు, దివ్యాంగులకు వసతి సౌకర్యాలు కల్పించలేదు. మార్చిలోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించినా ముందుకు సాగడంలేదు. తాగునీటి సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాలలు ఉన్నా వాటికి తాళాలు వేస్తున్నారు.
జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. రైల్వేస్థలాన్ని ప్రైవేట్ వ్యాపారులకు లీజ్కివ్వడంతో భవన నిర్మాణం పూర్తయింది. కానీ షాపులు మాత్రం పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రైల్వే అధికారుల పర్యవేక్షణ లేక పనులు ముందుకు సాగడం లేదు.