హుస్నాబాద్ రూరల్, జూన్ 10: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుంచి జనగామ వైపు వెళ్తుండగా బైక్ పంతులుతండా చౌరస్తాలో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఢీకొన్నది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న కరెంటోతు కవిత (32) అక్కడికక్కడే మృతిచెందగా, కరంటోతు రాజు, కరంటోతు స్వప్నలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు, గ్రామస్తులు మృతిచెందిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పోలీసులు సర్ధిచెప్పిన అనంతరం హుస్నాబాద్ దవాఖానకు కవిత మృతదేహాన్ని తరలించారు. మృతురాలికి భర్త, కూతురు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.