చిన్నకోడూరు, జూన్ 21 : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, బీడు పడ్డ భూములను సస్యశ్యామలం చేస్తున్నామని, రైతులు రెండు పంటలు పండించుకోవడానికి రంగనాయకసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం నుంచి రంగనాయకసాగర్‌లోకి గోదావరి జలాలను జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి పూలు చల్లి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో నీరు విడుదల చేశామన్నారు. గోదావరి జలాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. రైతులు సంతోషంగా రెండు పంటలు పండించుకోవాలన్నారు. రంగనాయకసాగర్‌లోకి గోదావరి జలాలు వస్తున్నాయని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రైతుల కండ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి వెంట ఎంపీపీలు కూర మాణిక్యరెడ్డి, బాలకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.