సిద్దిపేట, జూలై 03 : రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా మిట్టపల్లి శివారులో నిర్మిస్తున్న ఆర్ఓబి సబ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులు ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గురువారం వారు ఆర్డీవోను కలిసి తమ సమస్యను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సబ్ రోడ్డు నిర్మాణంతో సుమారు 187 మంది ఇండ్లను భూములను, ప్లాట్లను కోల్పోతున్నామన్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే ఎకరాకు రూ .15 లక్షల 30 వేలు పరిహారం ఇచ్చేందుకు అవార్డు పాస్ చేసి సంబంధిత భూ యజమానులకు నోటీసులను అందజేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనే వ్యవసాయ భూమికి రూ.18 లక్షలు ఇచ్చి, ఇప్పుడు కమర్షియల్ భూములకు, నివాస గృహాలకు ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తామని నోటీసులు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు. తాము గత రెండు రోజులుగా అవార్డు ఆర్డర్ కాపీని నోటీస్ బోర్డ్ లో పెట్టాలని లేదా తమకు ఇవ్వాలని కోరితే అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ భూములకు సరియైన పరిహారం అందించాలన్నారు.