సిద్దిపేట అర్బన్, నవంబర్ 9: ఉద్యమాల గడ్డ సిద్దిపేట. మా డీఎన్ఏలోనే పౌరుషం ఉందని, వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు రాజనర్సు, మాజీ ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, బీఆర్ఎస్ నేత పూజల వెంకటేశ్వరరావు(చిన్నా), కౌన్సిలర్ బ్రహ్మం కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావును హెచ్చరించారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..మాజీమంత్రి హరీశ్‌రావుపై, బీఆర్ఎస్ నాయకులపై మైనంపల్లి హన్మంతరావు వ్యక్తిగతంగా మాట్లాడటాన్ని తీవ్రం గా ఖండించారు. సిద్దిపేట పౌరుషాల గడ్డ అని.. తామంతా ఉద్యమంలో కొట్లాడిన వాళ్లమని, ఇక్కడికి వచ్చి అవాకులు చెవాకులు పేలితే సహించబోమన్నారు. శాంతియుతంగా ఉన్న సిద్దిపేట ప్రశాంతతను చెడగొడితే బాగుండదన్నారు. మీరు చేసే కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న అక్కసుతో ఇష్టమొచ్చినట్టు మా ట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధిష్టా నం తనను గుర్తించకపోతే సిద్దిపేటకు వచ్చి ప్రెస్మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
సిద్దిపేట ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన హరీశ్‌రావు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారన్నారు. గతంలో నగర బహిష్కరణ గురై పక్క నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యే సిద్దిపేటకు వస్తే తమకేమీ సంబంధం లేదన్నారు. ప్రజాస్వామ్యం లో దమ్ము అనేది ఎన్నికల్లో గెలిచి.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఉం టుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుపోయిన వెటర్నరీ కళాశాల, ఈపీఎఫ్ కార్యాలయాన్ని తిరిగి తీసుకురావడం లో, శిల్పారామం నిధులు తీసుకురావడంలో మీ దమ్ము చూపిస్తే బాగుంటుందన్నారు. తాము నిర్మాణాత్మక ఆలోచనతో మాత్రమే ఉన్నామని.. ప్రజల సమస్యలు తీర్చడంలో మీ చొరవ చూపిస్తే బాగుంటుందన్నారు. ఇవన్నీ కాకుండా ప్రజల చేత గెలిచిన ఎమ్మెల్యేను వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు అరవిందర్రెడ్డి, నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, ఆంజనేయులు, కనకరాజు, ఉమేశ్, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.