రాయపోల్ జనవరి 09 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రథమిక పాఠశాలలో విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాల్లో రంగవల్లులతో అందంగా ముగ్గులు వేసి ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
అదేవిధంగా భోగి పండుగకు ప్రతీకగా భోగి మంటలు వెలిగించి, పాలు పొంగించి సంప్రదాయాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలతో పాఠశాలలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సంక్రాంతి ప్రాముఖ్యతను చాటుతూ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.
మండలంలోని వడ్డేపల్లి ఉన్నత పాఠశాల, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాఠశాల ముందు రంగురంగుల ముగ్గులు వేసి భోగి మంటలను వెలిగించారు. చిరుధాన్యాలతో రంగు రంగుల ముగ్గులు వేసి విద్యార్థులు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు రావడంతో విద్యార్థులు శుక్రవారం పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకోగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.