రాయపోల్, జూలై 26: సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై గుంతలు పడి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం రద్దీగా ఉంటే ప్రాంతంలో నడిరోడ్డుపై గుంతలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక శివాజీ చౌరస్తా వద్ద గత కొన్ని గత సంవత్సరం నుంచి గుంతలు ఏర్పడినప్పటికీ అటువైపు వెళుతున్న అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు గుంతలు పూడ్చివేయాలని వేడుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. అంబేద్కర్ విగ్రహం నుంచి శివాజీ విగ్రహం వరకు ఉన్న రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. వర్షాలు కురిస్తే రోడ్డుపై వెళ్లాలంటే వాహనాదారులకు ఇబ్బందిగా మారింది. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎటు చూసినా రోడ్డుపై గుంతలు ఉన్నాయని ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి గొంతులు పూడ్చివేసి చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ మండల కేంద్ర వాసులు కోరుతున్నారు.