మెదక్ అర్బన్, జూన్ 11: దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి నూతన చట్టాలను అమలుచేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకనుణంగా నూతన చట్టాలపై పోలీసులకు మెదక్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాలానుగుణంగా ఐపీసీ, సీఆర్పీసీ, ఐఈఏ చట్టాలను సవరణ చేయగా కొన్నింటిని నూతనంగా చేర్చారని పేర్కొన్నారు. ఈ చట్టాలపై జిల్లాలో కొంతమంది అధికారులకు శిక్షణ ఇచ్చారన్నారు. శిక్షణ పొందిన అధికారులు విడతల వారీగా నిర్వహించే శిక్షణలో అవగాహన కల్పిస్తారని చెప్పారు. కొత్త చట్టాలైన భారతీయ న్యా య సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియంపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని ఎస్పీ చెప్పారు. కొత్త చట్టాలపై అవగాహన రావాలంటే నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడే సాధ్యమవుతుందని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్‌కు ఎవరు అర్హులు, చార్జిషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో అధికారులు ఎలా వ్యవహరించాలో పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ రాజేశ్, తూప్రా న్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.