సిద్దిపేట టౌన్, జనవరి 11 : విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండ్లకు తాళాలు వేసి వెళ్తారు.కాగా, పండుగకు ఊళ్లకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసుల సూచిస్తున్నారు. కనీస రక్షణ, జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. ప్రధానంగా సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెటూర్లకు చాలామంది వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో నేరాలు జరగుకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటున్నది. ప్రత్యేకంగా రాత్రివేళల్లో గస్తీ ముమ్మరం చేసింది. సిద్దిపేట కమిషనరేట్ పరిధి, మెదక్ జిల్లాలో అన్ని ప్రాంతాలపై నిఘా పెంచింది. ఈ సందర్భంగా పలు సూచనలు జారీ చేసింది.
అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు…
అత్యవసర సమయాల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లేవారి కోసం పోలీసుశాఖ సిద్దిపేట జిల్లా మూడు డివిజన్ల ఏసీపీ నంబర్లతో పాటు కంట్రోల్ రూమ్, కమిషనరేట్ వాట్సాప్ నంబరును అందుబాటులో ఉంచిది. సిద్దిపేట ఏసీపీ నంబరు 9490617009, గజ్వేల్ ఏసీపీ 8333998684, హుస్నాబాద్ ఏసీపీ 7901640468, కంట్రోల్ రూమ్ 8333998699, కమిషనరేట్ 7901100100 లేదా డయల్ యువర్ 100కు సమాచారం అందిచొచ్చు.
ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాం..
సంక్రాంతి పండుగ సమయంలో చోరీల నియంత్రణకు అన్ని రక్షణాత్మక చర్యలు చేపట్టాం. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశాం. రాత్రివేళల్లో గస్తీ పెంచాం. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణం త్వరగా ముగించుకోవాలి. ఇంట్లో విలువైన వస్తువులను ఉంచుకోవద్దు. ఇంటికి తాళం వేసి వెళ్లేవారు చిరునామా, ఫోన్ నంబరు స్థానిక పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. తమ వివరాలు రిజిస్టర్లో నమోదు చేసుకొని ఊరికి వెళ్లే వారి ఇండ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలి.
చోరీల నియంత్రణకు అన్ని చర్యలు
పండుగ సెలవుల్లో చాలామంది ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం. రాత్రివేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. మెదక్ జిల్లా పోలీసులు నిఘా నేత్రం కింద ప్రజలు, దాతల సహకారంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఇన్స్టాల్ చేశాం. ప్రజలు తమ కాలనీలు, ఇం డ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా మెదక్ జిల్లా పోలీసు వాట్సాప్ నంబర్ 7330671900కు సమాచారం ఇవ్వాలి. దగ్గరలోని పోలీస్స్టేషన్ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి.