Cotton Crop | తొగుట, ఆగస్టు 8 : పత్తి పంటలో అంతర పంటలు వేసుకోవడంతో చీడ పీడలను నివారించవచ్చని శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి అన్నారు. గుడికందుల గ్రామంలో బీరయ్య అనే రైతు పంటను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికంగా వర్షాలు కురిసినప్పుడు పత్తిలో పురుగు ఉధృతి పూర్తిగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు పత్తి పంట వేసుకొని ఆర్థికంగా లాభాలు పొందాలని పేర్కొన్నారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ప్రత్తి పంటలో ఆశించే రసం పీల్చే పురుగులను నివారించడానికి మందు పూత పద్దతిని వివరించడం జరిగింది.
ప్రత్తి పంటని తొలి 60 రోజుల దశలో రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పేను బంక, తామర పురుగు, పచ్చదోమ ఆశించి నష్టపరచటం వలన సుమారుగా వంట దిగుబడి 12 శాతం వరకు తగ్గే అవకాశమున్నది. అలాగే తొలిదశలో వీటి ఉధృతి అధికంగా ఉంటే మొక్క పెరుగుదల చాలా వరకు కుంటు పడి దిగుబడులు తగ్గుతాయి. పేనుబంక పిల్ల, తల్లి పురుగులు ఎక్కువగా మొక్క లేత భాగాలను ఆశించి నష్టపరుస్తాయి. పేనుబంక ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి క్రిందకి ముడుచుకొని పోవడం గమనించవచ్చు. ప్రత్తిలో అంతరపంటగా పెసర పంట వేసినప్పుడు ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గిపోవును. అధిక వర్షాలకు ఈ పురుగు ఉధృతి కూడా పూర్తిగా తగ్గిపోతుంది.
అధిక వర్షం, మబ్బులతో కూడుకున్న వాతావరణంలో ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. ఆకులపై నూగు ఎక్కువగా ఉన్న రకాలలో దీని ఉధృతి తక్కువగా ఉంటుంది. పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. పురుగు ఆశించిన ఆకుల అంచులు మొదట పసుపు రంగులోకి మారి క్రిందికి ముడుచుకొని ఆ తర్వాత ఆకు అంచులు ఎర్రబడి క్రమేపి ఎండి రాలిపోతాయి. ఈ పురుగు పైరు లేత దశ నుండి పంట కాలం చివరి వరకు అశిస్తుంది. ప్రత్తిలో అంతరపంటలుగా సోయాచిక్కుడు, బొబ్బెర వంటి పంటలను వేసినప్పుడు ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది.
పత్తి పంటలో తొలిదశ నుండి దీని ఉదృతి కనబడుతుంది. తొలిదశలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్క గిడసబారి పెరుగుదల పూర్తిగా తగ్గిపోతుంది.ఈ పురుగులు సన్నగా పసుపు గోధుమ రంగులో ఉంటాయి. వీటి పిల్ల పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను గోకి రసాన్ని పీలుస్తాయి. దీని వలన బెట్ట వాతావరణ పరిస్థితులలో ఈ పురుగు ఉధృతి ఎక్కువ.పంట తొలిదశలో వచ్చే ఈ రసంపీల్చే పురుగుల నివారణకు మొదటి నుండే విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారి చేయకుండా విత్తిన రెండు నెలల వరకు ప్రత్తి కాండానికి (పైన లేత ఆకుపచ్చ భాగంలో) మందు పూత ద్వారా తొలిదశలో ఆశించే ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చును.
దీనికిగాను ప్రత్తి పంట 30,45, 60 రోజుల దశలో ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ నీరు 1:4 నిష్పత్తి లేదా ఫ్లోనికామిడ్, నీరు 1:20 నిష్పత్తిలో కలుపుకొని కాండానికి పై భాగంలో పూయాలి. ఈ పద్ధతిలో మిత్ర పురుగులకు ఎటువంటి హాని లేకుండా కేవలం రసంపీల్చే పురుగులు.నివారించవచ్చు. దీని ద్వారా రైతులకు సుమారుగా ఎకరాకు రూ.2 వేల వరకు ఖర్చు తగ్గే అవకాశమున్నది.
వాతావరణంలో రసాయన మందుల అవశేషాలు కొంతవరకు తగ్గే అవకాశమున్నది. కాండానికి మందు పూత పద్ధతియే కాకుండా, తొలిదశలో రసం పీల్చే పురుగులను 5% వేప కషాయం లేదా లీటరు నీటికి 5.0 మి.లీ. (1500 పిపియం) వేపనూనెను 1 మి.లీ. శాండోవిట్ లాంటి జిగురు మందుతో కలిపి పిచికారి చేసుకున్నట్లైతే వీటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు హాని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.