సిద్దిపేట, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 945 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో మహిళా, సహకార సంఘాలు, మార్కెటింగ్‌శాఖ ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1,89,668 మంది రైతుల నుంచి 8,72,913 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.1,710.13 కోట్లు. ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,265.88 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన రైతులకు త్వరలోనే ధాన్యం డబ్బులు జమకానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోళ్లు వందశాతం పూర్తయిన చోట ఇప్పటి వరకు 591 కేంద్రాలను మూసి వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వానకాలం ధాన్యాన్ని రైతుల వద్దనే కొనుగోలు చేసేందుకు సెంటర్లు ఏర్పాటు చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా మద్దతు ధరతో కొన్నది. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూస్తున్నది. వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 86శాతం మేర ధాన్యం కొనుగోలు పూర్తి చేశారు. వారం, పది రోజుల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 3,44,540 మెట్రిక్ టన్నుల ధాన్యం అధికారులు సేకరించారు. మరో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా. జిల్లాలో మొత్తం 412 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 73 కేంద్రాలను మూసివేశారు. 83,611 మంది రైతుల నుంచి రూ.675.29 కోట్ల విలువైన ధాన్యం కొన్నారు. వీటికి సంబంధించి 52,550 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.460.71 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
మెదక్ జిల్లాలో ..
మెదక్ జిల్లాలో మొత్తం 378 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఐకేపీ ద్వారా 102, సహకార సంఘాల ద్వారా 273, మార్కెట్ కమిటీల ద్వారా 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మొత్తం పూర్తి కావడంతో అన్ని కేంద్రాలను మూసివేశారు. జిల్లాలో 74,902 మంది రైతుల నుంచి 3,86,833 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొన్నది. మిల్లులకు 3,74,022 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించారు. మొత్తం కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.758.19కోట్లు. 57,173 మంది రైతులకు రూ.547.00 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారు. మరో 17,729 మంది రైతులకు రూ.211.00 కోట్లు చెల్లించాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో ఐకేపీ,సహకార సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా మొత్తం 155 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నారు. కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో 143 కేంద్రాలను మూసి వేశారు. ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లాలో 31,190 మంది రైతుల నుంచి 1,53,030 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ఆయా కేంద్రాల నుంచి 1,52,803 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించారు. మొత్తం కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.299.94 కోట్లు కాగా, ఇప్పటి వరకు 25,375 మంది రైతులకు రూ.258.19 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. మరో 5,590 మంది రైతులకు రూ.39.93 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో త్వరలో జమ చేయనున్నది.
కొనుగోలు చేసిన ధాన్యం విలువ కోట్లలో..
జిల్లాపేరు- సిద్దిపేట
ధాన్యం విలువ – రూ.675.29
రైతులకు చెల్లించినవి – రూ.460.71
జిల్లాపేరు – మెదక్
ధాన్యం విలువ – రూ.758.19
రైతులకు చెల్లించినవి – రూ.547.00
జిల్లాపేరు – సంగారెడ్డి
ధాన్యం విలువ – రూ.299.19
రైతులకు చెల్లించినవి- రూ.258.19
కొనుగోళ్ల వివరాలు
జిల్లాపేరు – సంగారెడ్డి
ప్రారంభించిన కేంద్రాల సంఖ్య – 155
మూసివేసిన కేంద్రాల సంఖ్య – 143
రైతులు – 31,190
కొనుగోలు చేసిన ధాన్యం – 1,53,030 మెట్రిక్ టన్నులు
కొనుగోళ్ల వివరాలు
జిల్లాపేరు – సిద్దిపేట
ప్రారంభించిన కేంద్రాల సంఖ్య – 412
మూసివేసిన కేంద్రాల సంఖ్య – 73
రైతులు – 83,611
కొనుగోలు చేసిన ధాన్యం – 3,44,550 మెట్రిక్ టన్నులు
జిల్లాపేరు – మెదక్
ప్రారంభించిన కేంద్రాల సంఖ్య – 378
మూసివేసిన కేంద్రాల సంఖ్య – 378
రైతులు – 74,902
కొనుగోలు చేసిన ధాన్యం – 3,86,833 మెట్రిక్ టన్నులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోళ్ల వివరాలు
ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు – 945
మూసివేసిన కొనుగోలు కేంద్రాలు- 594
రైతులు -1,89,703
కొనుగోలు చేసిన ధాన్యం – 8,84,413 మెట్రిక్ టన్నుల ధాన్యం