దుబ్బాక / దుబ్బాక టౌన్, మార్చి 1: కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తూ, రైతులను ఇబ్బంది పెడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కలిసి కొత్త ప్రభాకర్‌రెడ్డి మేడిగడ్డను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దుబ్బాకలో మాట్లాడుతూ మేడిగడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కుంగిన మూడు పిల్లర్లను మరమ్మతులు చేసి రైతాంగాన్ని ఆదుకోవల్సిన ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్నదన్నారు.
ఆరు నెలల్లో మేడిగడ్డ బ్యారేజీని పూర్తిచేసి రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలన్నారు. సాగు, తాగునీరు లేక నాలుగు జిల్లాల ప్రజలు, రైతులు ఇబ్బందిపాలవుతున్నారన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తాగు, సాగునీరుతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉన్నారని ఇలాంటి సమయంలో చిన్నపాటి సాకును అడ్డం పెట్టుకొని మొత్తం ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ను నిందించడం సరైంది కాదన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ కింద తవ్వవలసిన కాల్వలను తవ్వి రైతులకు సాగునీరు అందించాలని ప్రభాకర్‌రెడ్డి కోరారు.