హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో వాద, ప్రతివాదనలు పూర్తయ్యాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది, ఏప్రిల్ 8వ తేదీన తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్‌ను ఏర్పా టు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీచేసింది. దీనిని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్, ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్, రిటైర్డు ఐఏఎస్ ఎస్కే జోషి వేర్వేరు వ్యాజ్యాలు దాఖలుచేశారు. ఈ పిటిషన్లపై సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ పూర్తిచేసింది.
హరీశ్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టు ల నిర్మాణాలు, వ్యయాన్ని పరిశీలిస్తే వ్యయం పెరుగని ప్రాజెక్టు ఒకటి కూడా ఉండదని చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం 9.7 రెట్లు పెరిగిందని, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, పులిచింతల తదితర ప్రాజెక్టుల ఖర్చు సైతం భారీగా పెరిగిందని వివరించారు. ఏ ప్రాజెక్టును తీసుకున్నా ముం దస్తు అంచనాలకన్నా, నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం భారీగా పెరిగిందని వెల్లడించారు. కాళేశ్వరంలో మాత్రం 1.9 రెట్లు మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా అనేక ప్రయోజనాలు కలిగాయని తెలిపారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని, ఎల్లంపల్లి నుంచి తాగునీటికి కేటాయించిన 30 టీఎంసీల నీటిని, 10 టీఎంసీల ఇతర జలాలను తరలించారని, కొండపోచమ్మ సాగర్‌లో తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ చేశారని వివరించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించేందుకు రూ.7,700 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని హెచ్ఎండీఏ ప్రకటించిందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు రిజర్వాయర్ల నిర్మాణం, నిర్వహణ ప్రభుత్వ బాధ్యత అని శేషాద్రినాయుడు పేర్కొన్నారు. నాటి పాలకులపై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రభుత్వ పెద్దల కుట్రను గుర్తించాలని కోరారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాల కేసులో భక్షి గులాం మహ్మద్‌పై కమిషన్ విచారణ వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకా రం.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తీరు చట్టబద్ధం కాదని స్పష్టంచేశారు. భక్షిపై కేసులో కమిషన్ 400మందిని విచారించిందని, వారి ని క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు భక్షి కోరితే కమిషన్ అవకాశం ఇవ్వలేదని వివరించారు. దీని ని కోర్టులో సవాల్ చేయగా (జమ్ము-కశ్మీర్ వర్సెస్ భక్షి గులాం మహ్మద్) సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించిందని చెప్పారు. అయితే విచారణ కమిషన్.. పిటిషనర్లను రాజకీయం గా దెబ్బతీయాలనే దురుద్దేశం, కుట్ర కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నదని పేర్కొన్నారు. కమిషన్ 3 బరాజ్‌ల నిర్మాణాలపై ఎంతోమందిని విచారించిందని, సాక్షుల వాంగ్మూలాల్లోని అభియోగాలకు వివరణను కమిషన్ కోరలేదని తెలిపారు. పిటిషనర్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినవాళ్లను, చూపిన ఆధారాల వివరాలను పిటిషనర్లకు అందజేయలేదని పేర్కొన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్‌లోని సెక్షన్- 8(బీ), 8(సీ) ప్రకారం పిటిషనర్లను క్రాస్ ఎగ్జామ్ చేసే అవకాశం కల్పించలేదన్నారు. పిటిషనర్లకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ఆధారంగా కమిషన్ ఏకపక్షంగా తుది నిర్ణయానికి రావడం సరికాదని, ఇది సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని వాదించారు.
కాళేశ్వరం పూర్తయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌ను అపరభగీరథుడిగా రాష్ట్రం కొనియాడిందని శేషాద్రినాయుడు వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని, 13 జిల్లాల్లో 18 లక్షలకుపైగా ఎకరాల భూమికి సాగునీరు అందించిందని చెప్పారు. ప్రాజెక్టుతో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశాలతో కమిషన్ నివేదికను ముందుగానే వెల్లడించిందని అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘మీకు వ్యతిరేకం గా వాంగ్మూలం ఉన్నది. మా వద్ద ఈ ఆధారా లు, పత్రాలు ఉన్నాయి. వీటిపై మీ వివరణ ఏమిటి?’ అని కమిషన్ కోరి ఉంటే పిటిషనర్లు జవాబు చెప్పి ఉండేవాళ్లని స్పష్టంచేశారు. కమిషన్ అలాంటి అవకాశం ఇవ్వకుండా సాక్షిగా విచారణకు పిలిచి, రిపోర్టులో మాత్రం నిందలు మోపిందని పేర్కొన్నారు. కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని, జీవో-6ను కొట్టేయాలని శేషాద్రినాయుడు వాదించారు.
స్మితా సభర్వాల్, ఎస్కే జోషి తరఫున సీనియర్ న్యాయవాది జే రామచందర్‌రావు, తరుణ్ జీ రెడ్డి వాదనలు వినిపించారు. సాక్షి గా కమిషన్ నోటీసు ఇచ్చిందని, నివేదికలో తప్పు చేసినట్టు ఏకపక్షంగా తేల్చిందని తప్పుపట్టారు. నిందితులకు షోకాజ్ నోటీసు ఇవ్వా ల్సి ఉంటుందని, కానీ, విధివిధానాలకు తిలోదకాలు ఇచ్చిందని, అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిన కమిషన్‌ను రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. ఈ లోగా ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలను ఒకటి రెండు రోజుల్లో సమర్పించవచ్చునని స్పష్టంచేసింది.
ప్రభుత్వానికి కమిషన్ వేసే అధికారం లేదని తాము ఎప్పుడూ చెప్పలేదని శేషాద్రినాయుడు పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటును సవాల్ చేయడం లేదని, కానీ జస్టిస్ ఘోష్ కమిష న్ చేపట్టిన విచారణ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నదని చెప్తున్నామని స్పష్టంచేశారు. కమిషన్ వల్ల పిటిషనర్లకు నష్టం లేద ని ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. నివేదిక వచ్చేదాకా వారికి వ్యతిరేకంగా ఏం జరుగుతున్నదో పిటిషనర్లకు తెలియదని చెప్పారు. కమిషన్ నివేదికను అసెంబ్లీకి నివేదించకముందే ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి ఆ రిపోర్టులోని కీలక విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బహిర్గతం చేశారని గుర్తుచేశారు. కమిషన్ రిపోర్టులోని విషయాలే కదా, నష్టం ఏమీ లేదని ప్రభుత్వం చెప్పడం లో అర్థం లేదని పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా నివేదిక ఉన్నదని స్పష్టంచేశారు. విచారణకు హాజరుకావాలంటూ కమిషన్ ఇచ్చిన నోటీసులన్నీ ఒకేలా ఉన్నాయని తెలిపారు.