Fire Accident | రాయపోల్, ఆగష్టు 05 : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో వెంటనే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి భాస్కర్ డిమాండ్ చేశారు. గత రెండు రోజుల క్రితం పబ్బ అశోక్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వలన పూర్తిగా దగ్ధం అవడం బాధాకరమని వారి కుటుంబానికి రూ.20 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేనందున ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ స్టేషన్ దౌల్తాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్, సిద్దిపేట దుబ్బాక పట్టణాలలో మాత్రమే అందుబాటులో ఉండడం వలన ఎక్కువ నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దౌల్తాబాద్ మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైన సందర్భంగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన అనంతరం గంట వరకు ఫైర్ ఇంజన్ రాకపోవడంతో ప్రమాద స్థాయి పెరిగిందని గుర్తు చేశారు.
ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంటే ప్రమాద స్థాయి తగ్గేదని తెలిపారు. ఇతర ఇళ్లకు అగ్నిప్రమాదం జరగకుండా దోహదపడుతుందని గుర్తు చేశారు. ఫైర్ స్టేషన్ దౌల్తాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల సుమారు 40 నుంచి 50 గ్రామాల వరకు ఫైర్ ఇంజన్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అగ్నిమాపక కేంద్రాన్ని దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.