గజ్వేల్, మే 2: సీఎం రేవంత్రెడ్డి తరుచూ కేసీఆర్పై చేస్తున్న విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణానికి చెందిన రహుఫ్కు రూ.60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను విస్మరించిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు గతప్రభుత్వంపై విమర్శలు తప్పా వారు చేసింది శూన్యమన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13హామీలను నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. నేడు గ్రామాల్లో తాగునీరు సరిపడా రాకపోవడంతో ప్రజలు వేసవిలో ఇబ్బందిపడుతున్నారని, గ్రామాల్లో మళ్లీ వెనకటి రోజులు వస్తున్నయని, బోర్లలో మోటర్లను దించుతు తాగునీటిని సరఫరా చేసే దుస్థితికి తెచ్చారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా బిగించి కేసీఆర్ నీళ్లిస్తే రేవంత్రెడ్డి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నరన్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతంతో ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కన్పిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోద్దిన్, నాయకులు శ్రీధర్, అల్తాఫ్లు పాల్గొన్నారు.