చేర్యాల, మే 21 : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వ్యవసాయాన్ని పండుగ చేసిన మహోన్నత నేతగా కేసీఆర్ చరిత్రకు ఎక్కారని, కాంగ్రెస్ సర్కారు కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక విచారణ పేరిట నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కేసీఆర్, హరీశ్‌రావులకు కాంగ్రెస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరిట జారీ చేసిన నోటీసుల పై ఎమ్మెల్యే పల్లా ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక అన్ని విధాలుగా విఫలమై ప్రజల దృష్టి మళ్లించేందుకు విచారణ అంటూ నోటీసులు జారీ చేసిందన్నారు.
కాంగ్రెస్ సర్కారు పై తెలంగాణ మరోసారి మర్లపడే రోజులు సమీపిస్తున్నాయని, రైతుల కష్టాలు తెలిసిన మహా నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అందుకే ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగు నీరు అందించి వారికి అండగా ఉన్నటు తెలిపారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను వేధింపులకు గురి చేసి, ఇబ్బందులు పెట్టేందుకే విచారణ రావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు చేతకాని తనాన్ని, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.
పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్‌వన్ చేశారని, రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. కాళేశ్వరం నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సస్యశ్యామలం చేశారని, రైతుల సాగునీటి గోస తీర్చేందుకు భగీరథుడిలా తపస్సు చేసి పనులుపూర్తి చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అన్ని దేశాలు మెచ్చుకున్నాయని, కేసీఆర్ గుర్తులు చెరపాలనుకుంటే మీ తరం కాదనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గమనించాలన్నారు.
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కేసీఆర్ పాలననే గుర్తు చేసుకుంటున్నారని, రాష్ట్రానికి దేశ, విదేశాల నుంచి ఏవరు వచ్చిన ఇక్కడి కట్టడాలు, అభివృద్ధికి వాటికి కారణమైన కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్‌కు ఉన్న ఇమేజ్ను ఓర్వలేక సీఎం రేవంత్‌రెడ్డి విచారణ పేరుతో నోటీసులు ఇప్పించారని, ఆయన వాటికి ఎవరు భయపడరన్నారు. ఏది ఏమైనప్పటికి ప్రజలకు అన్ని విధాలుగా మంచి చేసిన కేసీఆర్‌ను ఆయన కుటుంబాన్ని వేధించేందుకు పాల్పడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.