మిరుదొడ్డి : గ్రామాల్లో బెల్టుషాపులు కోకొల్లలుగా వెలుస్తుండటంతో పేద ప్రజలు మద్యానికి బానిసలై ఆర్థికంగా చితికి పోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం బెల్టు షాపులను వెంటనే తొలగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మిరుదొడ్డిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎక్సైజ్ సీఐ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఎక్సైజ్ సీఐ కార్యాలయాన్ని మిరుదొడ్డికి మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల్లో బెల్టు షాపులు ఉండకుండా చూస్తానని మహిళలకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు.
పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లోని యువత మత్తు పదార్థాలకు, గంజాయికి అలవాటు పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని నిలువరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, మాజీ ఎంపీపీ పంజాల కవితా శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ రాములు, ఏఎంసీ మాజీ చైర్మన్లు బాపురెడ్డి, సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, సీనియర్ నాయకులు సూకురి లింగం, నాయకులు మల్లేశం, దుర్గారెడ్డి, మల్లయ్య, కుమార్, శేఖర్, ఎక్సైజ్ శాఖ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
మిరుదొడ్డి : అక్బర్పేట-భూంపల్లి మండలం మోతె గ్రామంలో శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ అక్బర్పేట-భూంపల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, సీనియర్ నాయకుడు పంజాల శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు రాజేశ్వర్, రవి, శ్రీనివాస్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.