హుస్నాబాద్టౌన్, ఏప్రిల్ 29: విద్యార్థులు పోటీప్రపంచంలో కష్టపడి చదువుతే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాధారపు వైష్ణవి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను 468మార్కులు సాధించిన విషయం తెలిసిందే. ఇంటర్లో టాపర్గా నిలిచిన వైష్ణవి ఇంటికి మంగళవారం ఉదయం మంత్రి వెళ్లి విద్యార్థిని వైష్ణవితోపాటు వారి తల్లిదండ్రులను సైతం సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైష్ణవి ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహంలేదన్నారు. గురుకులాల్లో మంచి ప్రతిభ కనబరిచిన150మంది విద్యార్థులను సన్మానించామని తెలిపారు. వైష్ణవికి భవిషత్తులో ఎలాంటి అవసరం ఉన్నా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ సంస్థచైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్విండోచైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు చిత్తారి రవీందర్, మ్యాదరబోయిన శ్రీనివాస్, కాశబోయిన సాంబరాజు, నమిలికొండ అయిలయ్య తదితరులు ఉన్నారు.