12 నుంచి 14 ఏండ్ల పిల్లలందరికీ కరోనా వ్యాక్సిన్
మెదక్ జిల్లాలో 37,933 మంది
డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్రావు
మెదక్, మార్చి 15: 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్రావు తెలిపారు. బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో మెదక్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారులు, సూపర్వైజర్లతో గూగుల్ మీట్ నిర్వహిచారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 37,933 మందిని గుర్తించామన్నారు. 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని, ఈ వ్యాక్సిన్ కేవలం ప్రభుత్వ దవాఖానల్లో మాత్రమే వేయాలన్నారు. వ్యాక్సినేషన్ సమయంలో పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా వారివెంట ఉండాలని సూచించారు. దీనికి ‘బయోలాజిరల్ ఈ’ వారు తయారు చేసిన ‘కార్బివాక్స్’ వ్యాక్సిన్‌ని ఉపయోగిస్తున్నామని, 28 రోజుల వ్యవధిలో రెండో టీకా వేస్తామని తెలిపారు. కోర్బివార్స్ను ఓపెన్ చేసిన 4 గంటలలోపు వాడాలని, ఒక వయల్ 20 మందికి వేయవచ్చని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లాకు మొదటి విడుతగా 540 వయల్స్ (10,800 డోసులు) చేరుకున్నాయని, వీటిని పీహెచ్సీ జనాభా ఆధారంగా వారికి వయల్స్‌ను అందజేస్తామన్నారు. ప్రతి సెషన్ దగ్గర ఏఈఎఫ్ 1 రిట్ తప్పనిసరిగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. తర్వాత 60 సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పటి వరకు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నామని ఇకపై ఎటువంటి ఆంక్షలు లేకుండా 60 సంవత్సరాలు పై బడిన వారందరికీ కరోనా టీకా అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నవీన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో తదితరులు పాల్గొన్నారు.