చేర్యాల, మార్చి 2: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని మంగళవారం అర్ధరాత్రి ఆలయవర్గాలు వైభవంగా నిర్వహించాయి. మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరాగా, పెద్దపట్నం తంతు నయనానందకరంగా కొనసాగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు శివరాత్రి సందర్బంగా జాగరణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మతో కొలువైన మల్లికార్జునస్వామికి తలనీలాలు సమర్పించి కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించి దర్శించుకున్నారు. అనంతరం గుట్టపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు.
సంప్రదాయబద్ధంగా..
మల్లన్న ఆలయవర్గాల ఆధ్వర్యంలో ఒగ్గు పూజారుల నేతృత్వంలో పెద్దపట్నం నిర్వహించారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాన్ని, స్థల పురాణాన్ని ఒగ్గు పూజారులు పంచరంగులతో తయారు చేసిన పట్నం వద్ద జానపద రీతిన పాటలు పాడుతూ, స్వామిని స్త్తుతిస్తూ పెద్దపట్నం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా శివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలకు మల్లన్నకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అనంతరం స్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం, రాతిగీరలు ప్రాంతాల్లో ఊరేగించి ఆలయంలోకి తీసుకువెళ్లారు. రాత్రి 12గంటలకు గంగస్నానం, పన్నెండున్నరకు బియ్యాన్ని సుంకు పట్టడం, ఒంటిగంటకు మైలపోలు, రాత్రి 2గంటలకు ఒగ్గు పూజారులు పంచరంగులు కుంకుమ (ఎరుపు), పసుపు, తెలుపు (బియ్యం పిండి), ఆకుపచ్చ (తంగెడు పిండి), గులాలు తదితర వాటి చూర్ణాలను కలిపి ముగ్గులుగా వేసి పట్నంగా తయారు చేశారు. అనంతరం స్వామి వారికి బోనం నివేదనగా చెల్లించగానే, ఆలయ అర్చకులు స్వామి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నం దాటారు.
వెంటనే భక్తులు పెద్దపట్నం దాటి ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. సుమారు 50వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ డైరెక్టర్లు ముత్యం నర్సింహులు, ధరావత్ అనిత, బొంగు నాగిరెడ్డి, ఉట్కూరి అమర్‌గౌడ్, కొంగరి గిరిధర్, చింతల పరశురాములు, దినేశ్ తివారీ, గడ్డం మహేశ్‌యాదవ్, తూములు రమేశ్‌యాదవ్, తాళ్లపల్లి శ్రీనివాస్, పొతుగంటి కొంరెల్లి, సాయియాదవ్, శెట్టె ఐలయ్య, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ డీసీపీ మహేందర్, ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో చేర్యాల సీఐ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
మల్లన్నకు అన్నపూజ..
కొమురవెల్లి మల్లికార్జున స్వామి మహా శివరాత్రి పూజ ల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు పెద్దపట్నం కా ర్యక్రమాన్ని ఆలయవర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. బుధవారం మల్లన్న ఆలయంలో అన్నపూజ, ఏకాదశ రుద్రాభిషేకం పూజలు చేశారు. ఆలయ గర్భాలయంలో స్వామి వారి ముందున్న శివలింగం వద్ద అన్నపూజ, ఆ తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.