సిద్దిపేట అర్బన్, నవంబర్ 13 : మీరంతా పట్టుదలతో ఉద్యోగం సాధిస్తేనే.. ఒక ప్రజాప్రతినిధిగా తనకు నిజమైన ఆనందమని, పోలీస్ ఉద్యోగానికి శిక్షణ పొందుతున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మల్టీ పర్పస్ హైస్కూల్లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న శిక్షణా కేంద్రాన్ని పరిశీలించి.. శిక్షణ పొందుతున్న 300 మంది అభ్యర్థులకు తన సొంత ఖర్చులతో ఆయన పాలు, గుడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగ సాధనలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షకు పట్టుదలతో సన్నద్ధమై ఉద్యోగం సాధించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ తీసుకున్న 1030 మంది అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షలో 580 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్టుకు అర్హత సాధించారని తెలిపారు.
రెండో దశలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల పట్టణాల్లో శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన ఉచిత శిక్షణలో చాలా మంది పేద కుటుంబానికి చెందిన వారు పోలీస్ ఉద్యోగాలు సాధించారని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నదన్నారు. ఈ నోటిఫికేషన్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని.. కేవలం 5 శాతం మాత్రమే నాన్‌లోకల్ వాళ్లు పొందుతారన్నారు. రాష్ట్ర పోలీస్ ఉద్యోగాల్లో అవకాశం దక్కని వారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్మీ ఉద్యోగాలకు అవకాశం ఉండేదని.. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత ఆశలను నిర్వీర్యం చేస్తూ అగ్నిపథ్ పేరిట కాంట్రాక్ట్ విధానం తేవడం హేయమైన చర్య అని విమర్శించారు.
నాలుగేండ్లు ఉద్యోగం చేసి ఇంటికి పోయే విధానమే అగ్నిపథ్ అన్నారు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా యువత ఉద్యమం చేసి కేంద్రాన్ని నిలదీసిన విషయం మనందరం చూశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్లు విడుదల చేసిందని.. ఆ ప్రక్రియ కొనసాగుతుందని, అందులో 17 వేల ఉద్యోగాలు పోలీస్‌శాఖకు చెందినవే ఉన్నాయన్నారు. ఆర్థిక శాఖ సూచనల మేరకు సీఎం కేసీఆర్ అనుమతి పొంది.. మరో 2 వేల పోలీస్ ఉద్యోగాలు కూడా భర్తీ చేసే ఆలోచన ఉందన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా 85 శాతం రోగాలను దూరం చేయవచ్చని సూచించారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు నిర్మించడమే కాదని.. సామాజికంగా, ఉపాధి పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థికంగా, పచ్చనంలో.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ది చెందడమే నిజమైన అభివృద్ధి అన్నారు. ఆరోగ్య సిద్దిపేటగా మార్చడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, అదనపు డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.